పుట:Kavijeevithamulu.pdf/434

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

428

కవి జీవితములు.

యని నేను కృష్ణకవిని స్తోత్రము చేయం జూచిన నీపండితుఁ డట్టిస్తోత్రమునకుం దగ నని శునకసామ్య మంగీకరించెను. సభవారు నేను చెప్పిన వాక్యముల లోప మున్న యెడల నన్నును లేకున్నను కృ. కవిని మందలించెదరుగాక. అనుచుఁ బల్కి ఇట్టిలోకోత్తరపాండిత్యము గల దని గర్వించు నీపండితుని గ్రంథంబున నొరులు తప్పు పట్టలే రని సభలో ప్రాగల్భ్యముఁ జూపుట యెందులకు ? ప్రసక్తియే తటస్థించినఁ దప్పులున్నవో లేవో చూడవచ్చును. అధికముగఁ బ్రసంగించిన లాభ మే మున్నదని యూరకుండెను.

కృ. కవిని గ్రంథము చదువు మని రాజు కోరుట.

ఇట్లుగాఁ బ్రస్తావన నడచినపిమ్మట రాజు కృష్ణమూర్తికవితో సంవాదసమయ మిది కా దనియును, పూర్వపక్షమునకు లక్ష్మణకవి సమాధానము చెప్పియుండెఁగావున నాసంవాదము ముగిసినదియును, ఇఁక మీరుగ్రంథము చదివి నీగ్రంథములో దోషములు లేవనిపించుకొను పని మీయెందే యున్నదనియు ల. కవి అడిగినప్రశ్నముల కన్నిటికిని సమాధానములుచెప్పి అతని నొప్పించుటయే పండితధర్మ మని చెప్పఁగా దానికి సమాధానము లేక లక్ష్మణకవియే కాదు, ఎవ్వరు వచ్చియడిగిన నేమి భయమున్నది. గ్రంథ మటులనే చదివెదను. అని ల. కవిదిక్కు మొగంబై కృ. కవి యేవర్ణనచదువు మని కోరెదవు. లేక యింకేమి చెప్పుమని కోరెదవో సంప్రశ్నింపు మని విజృంభించెను. దానికి ల. కవి నవ్వుచు నీ కంతయుత్సాహమే యుండిన నడిగెదను. సమాధానములును జెప్పవచ్చును అని యిట్లనియె.

కృతిపతినిగూర్చి యడుగుట.

ఇపుడు నీవు కృతియిచ్చుచున్న గ్రంథ మెద్ది? ఎవ్వరికిఁగృతి నిచ్చినావు ? ఇపు డేకథాభాగము చదువుచున్నావు ? అని ల. కవి సంప్రశ్నము చేసెను. దానికిఁ గృ. కవి నేను కృతియిచ్చుచున్నగ్రంథముపేరు సర్వకామదాపరిణయము. దీనిని శ్రీరాజా శ్రీకాకర్లపూఁడి రామచంద్ర