పుట:Kavijeevithamulu.pdf/432

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

426

కవి జీవితములు.

దెలియ వర్తమానంబు పంచెను. అది విని రాజు లోకమునకు జడిసి రమ్మని మాఱువర్తమానంబు పంపెను. అంతట ల. కవి సభలోనికి వచ్చెను. రాజునుచితగౌరవంబున ల. కవిని కూర్చుండనియమించి కృష్ణమూర్తిశాస్త్రులు చేసినప్రబంధము వినుచున్నాము మీరును సమయమునకే వచ్చినారుగావున దీనిని విని యిందలి గుణదోషములను బరిశీలించి మాకుం గృతినిప్పింపుఁ డని యుపచారముగఁ జెప్పెను. దానికి లక్ష్మణకవి సమ్మతించక నే నెంతవాఁడను. కృ. కవి మహాపండితులు, మీరు మహాప్రభువులు సభచేసి చిత్తగించుచున్నారు, కావున నేనును మీతోపాటుగ వినుచుం గూర్చుండెద ననియెను.

ఆమాటలకు రాజు సమ్మతింపక అలభ్యయోగంబుగ మీయట్టి మహాకవులు తటస్థించినయపుడు గ్రంథము పరిశీలించఁ బడకపోయిన నిఁక మఱియెప్పుడు పరిశీలింపఁబడవలయును. కావున నంగీకరించక తప్ప దనుడు మీ రంగీకరించినశాస్త్రి యంగీకరింపవలయునుగదా? శాస్త్రికిని మాకును సరిపడదుకావున నన్ను బలవంతపెట్టవల దన నా పల్కులు విని కృ. కవి యాగ్రహించి రాజుంజూచి యిట్లనియె. ఈయాస్థానములో లక్ష్మణకవిని విద్వాంసుఁ డని వచియించుట హాస్యాస్పదము కాకపోవునా ? అనేకులు మహావిద్వాంసు లుండఁగా నీతని నేమేమొ పెద్ద వని ప్రభుఁ డనుచుండ సిగ్గులేక తానును తగుదు నని ల. కవి యొప్పుకొనుచున్నాఁడు. నాగ్రంథములోఁ దప్పుపట్టువా రుండుటయే కల్గిన నతఁడు లక్ష్మణకవి కన్యుఁ డగుఁగాని లక్ష్మణకవి కాఁడు. ఈతఁడు పేరునకు లక్ష్మణకవి యేమైనను కవితావిషయములో నవలక్షణకవియే యనవలెను గదా ? అని కృష్ణమూర్తిశాస్త్రి గద్దించి పల్కిన దానికి రా జేమియుననఁ జాలక యూరకుండె. అట్టి రాజుయొక్కశక్తిహీనతయును, కృ. కవియొక్క విజృంభణముం జూచి ల.కవి కృష్ణమూర్తికవిని యుడికించినం గాని కార్యము గా దని నవ్వుచు రాజుదిక్కు మొగంబై చూచి ఆసమీపమునఁ బడియున్న యొకకఱికుక్కం జూచి