పుట:Kavijeevithamulu.pdf/431

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పిండిప్రోలు లక్ష్మణకవి.

425

తించెను. అపుడు వారిలోఁ గొందఱవలన పిండిప్రోలి లక్ష్మణకవియొక్క నామమును తెలుపంబడినది. ఆపేరు వినినతోడనే కృ. కవి మీరు చెప్పినయతఁడు కవిత్వసంభావన లిచ్చెడు పెండ్లిపందిళ్లలో జరిగెడుసభలకుఁ బోవలసినవాఁడేకాని యిట్టిసభకు రావలసినవాఁడు కాఁడు. కాఁబట్టి అతనిపేరు జాబితాలోఁ జేర్చవల దని యధిక్షేపించి చెప్పెను. దానికి రాజసన్ని ధానవర్తులుగాని రాజుగాని సమాధానము చెప్పక మీ యిష్టము వచ్చిన వారినే పిలువ నంపుఁ డని చెప్పి యూరకుండిరి. కృ. కవియు నటులనే తనయిష్టమువచ్చిన వారిపేరిటనే శుభలేఖల నంపించెను. వానింబట్టి సభ కందఱును వచ్చియుండిరి.

లక్ష్మణకవి రామచంద్రపురమునకు వచ్చుట.

రాజసన్నిధి తనవిషయమై జరిగినవృత్తాంతమంతయు హితులవలన విని లక్ష్మణకవి తనయందు కృ. కవికిఁ గలయసూయచే నట్టి ప్రస్తావన చేసియున్నను రాజు వివేకియే అయిన దానిం దిరస్కరించి పదిమందిపండితులతోఁ బాటుగాఁ దనకును వర్తమానము బంపక పోవుటకు వగచి పిలువకున్న నైన సభలోనికిఁ బోయి తనప్రజ్ఞాదికములం జూపి రావలయు నని నిశ్చయించి ఆనాఁటికిఁ దానును రామచంద్రపురము వచ్చి చేరెను. అంతట ల. కవికి రాజాస్థానమున జరిగినవృత్తాంతముఁ జెప్పినమధ్యవర్తు లే. కృ. కవితో లక్ష్మణకవి గ్రామములో వచ్చియున్నాఁడు. కావున వర్తమానము బంపుట మంచి దనియును, ల. కవి కోటకుఁ బోవుమార్గములోనే బస చేసియుండెం గావున మర్యాదకు స్వయముగా నాహ్వానము చేసిన మఱియును మంచిదనియుంజెప్పిరి. ఆమాటలను గృ. కవి లక్ష్యము పెట్టక తనయూర నుండి యింతదూరము రాఁగల ల. కవి యీయూరిలో నుండురాజ సభకు రాలేఁడుగనుకనా? మనము పిలువకుండినను లోప ముండ దని సమాధానము చెప్పెను. ఆవృత్తాంతముం దెలుసుకొని ల. కవి తనంతటనే సభ ప్రారంభమైన కొంతసేపటికి బైలుదేఱిపోయి తనరాక రాజునకుఁ