పుట:Kavijeevithamulu.pdf/416

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
410
కవి జీవితములు.

వ. అని సామభేదోక్తు లాడినం గణింపక తృణీకరించు నతనితో నరసాసంతతి యిట్లనియె.

క. ఖరదూషణముఖ్యులు కవి, గురులు నడిచినట్టిత్రోవఁ గోరి నడవ ను
    ద్ధురుఁడ వగు నీదువాక్యవి, సరపరుషత్వమున కేను జంకుదునె మదిన్
    
గీ. విన్ము లక్ష్మణాగ్ర జన్మ మాన్యక్షేత్ర, మేను విడువ నెపుడు మానగుణము
    మద్వరోగ్రశక్తి మఱి యింక లంక నే, లగలవాఁడ నగుచు నెగడ వీవు."

అని యిట్లు దమ్మన్న యుత్తర మీయఁగా లక్ష్మణకవి కోపోటోపంబున నుత్తరమీయ నున్న నతని హితు లతని నివారించిరి. అటు పిమ్మట లేచి తనయింటికిం బోవఁ గమకించి లక్ష్మణకవి దమ్మన్న నుద్దేశించి సాధువాక్యంబుల ధర్మంబు బోధించిన నంతకంతకు దమ్మన మౌర్ఖ్యమునే యవలంబించుటకుం గనలి.

"క. ధరశ్రీరామేద్భక్తుఁడ, గరిమన్న మ్మువినినాదు కత నరసాజా
     నిరయంబున నినుఁ జేర్చున్, దురిత మణఁచి నెమ్మి రాదు దొసఁగొంద నిఁకన్.

క. లేదమ్మా కష్టము నీ, కేదమ్మా నేగి భీతి ఘృణ నీవొందన్
    రాదమ్మా యిఁక మిన్నక, పోదమ్మా యుక్తి నిజము పొలుపుగదమ్మా.

క. అని యిట్లనేక ములు పెం, పెనయంగాఁ బలికి జీవితేశునికడకున్
    జనుసమయము నీ కిదె వ, చ్చెను వేగిరపడకు మనుచుఁ జెప్పుచు మఱియున్.

క. నీపతితత్వం బంతయు, వ్యాపకతం జెందునట్లు వర్ణించెద నే
    నోపిక వాణీ రచనా, నైపుణి నీమదికి నొప్పి నాటుకొనంగన్."

అని పల్కి మఱికొన్ని వాక్యము లతనితోఁ జెప్పెను.

"గీ. ఏడుపందు ముల్లోకంబు లెఱుఁగ లంక, నేలకొలపరక్షేత్రాప్తి మేలు గాదు
     పేర్మి నాభూమిజాత సంప్రీతితోడ, వీడు మదియె సౌఖ్యము లిచ్చు వేయు నేల."

ఇ ట్లెన్నివిధంబులఁ జెప్పినను లక్ష్యము సేయక దమ్మన్న మూర్ఖవృత్తి నుండఁగ లక్ష్మణకవి తనయూరికిఁ దిరిగి పోయెను. అంతట దమ్మన్న తమ్ముఁ డగుభద్రయ్య యనుబుద్ధిశాలి తనయన్న చేసినది అక్రమముగ గ్రహించి అట్టిపని కూడ దని అనేకవిధంబులఁజెప్పి లక్ష్మణకవి ప్రజ్ఞావిశేషంబులు నాతనిక్షేత్రంబు హరింప నతఁడు యత్నింపఁగూడని పనియనియు నీక్రిందివిధంబునఁ జెప్పినట్లు వ్రాయుచున్నాఁడు. ఎట్లన్నను.