పుట:Kavijeevithamulu.pdf/407

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు.

కవిజీవితములు.

ఆంధ్రద్వ్యర్థికావ్యకవులచరిత్రము.

16.

పిండిప్రోలు లక్ష్మణకవి

ఇతఁడు నియోగిబ్రాహ్మణుఁడు కాఁపురము గోదావరి జిల్లాలోని రామచంద్రపురము తాలూకాలోని 'కుయ్యేరు' అనుగ్రామము. ఇతఁ డాగ్రామమునకు మిరాసీదారుఁడు, ఇతనిగ్రామము పిఠాపురపుజమూన్‌దారీలోనిది. ఇతనినాఁడు తత్సంస్థానమునకుఁ బ్రభుఁడు రావు నీలాద్రిరాయనాయకపద్మనాయకవంశభూషణుఁడు.

ఇతనికాలీనులు.

1. రాజా కొచ్చెర్లకోట. వేంకటరాయనామక మంత్రిశిఖామణి ఈయన అత్తిలి, ఆచంట సంస్థానాధిపతి.

2. బులుసు అచ్చయ్యశాస్త్రి. ఈయన మొన్నటివఱకు విశేష విఖ్యాతిం జెంది కీర్తిశేషు లగు బులుసుపాపయ్యశాస్త్రినామకాపర విద్యారణ్యుని తండ్రి.

3. ఒక్కలంకవీరభద్ర కవివరుఁడు. ఇతఁడే వాసపదత్తాపరిణయ మనుసంస్కృత వాసపదత్తనామక గ్రంథమును ప్రబంధముగా నాంధ్రీకరించినవాఁడు.

4. శిష్ణుకృష్ణమూర్తిశాస్త్రి. వేంకటాచల మహాత్మ్యము, సర్వకామదా పరిణయము మొదలగునాంధ్రకావ్యకర్త,

5. ఇంద్రకంటి విశ్వపతిశాస్త్రి. నారాయణ మననాదిక వేదాంత గ్రంథకర్త. వేదశాస్త్రరహస్యవేది.

6. రాజా కాకర్లపూడి పద్మనాభరాజు, రామచంద్రరాజు. వీరు రామచంద్రపురం కోట జమీన్దారీసంస్థానాధిపులు.

7. మొక్కపాటి పేరిశాస్త్రి. తర్కవ్యాకరణశాస్త్రవేత్త.

8. Mr. C. P. Brown, the Telugu Lexicographer. సి. పి. బ్రౌనుదొర. బ్రౌణ్య నిఘంటు వను నాంధ్రాంగ్లేయ నిఘంటు ద్వయము రచియించినవాఁడు.