పుట:Kavijeevithamulu.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

కవి జీవితములు



అతనిశిరంబుతో మాత్రము సహగమనంబు చేయుతలంపున నుండఁగా నంతట నామార్గమున నీభీమకవి తటస్థ మయ్యె ననియు నపుడు రణతిక్కనభార్య యతనికి నమస్కరింప "సౌభాగ్యవతీ భవ" అని దీవింపఁగా నపుడు సమీపమున నున్న వార లాపె పెనిమిటి మృతుండై యుండె నని తెల్పఁగా నాపె వచ్చి తన పెనిమిటిని బ్రతికించి తన్నురక్షింపుఁ డని ప్రార్థించె ననియు దానికి భీమకవి రణతిక్కనశిరంబును, గళేబరంబును గూర్చి యుంచిన బ్రతికించెద ననిన నపు డాపతివ్రత లేచి తనపఁతిశరీరఖండంబులు పైకి వచ్చియుండవలయు నని ప్రార్థింపఁగా నాపె పాతివ్రత్యవిశేషంబున నాఖండంబులు నృత్యము చేయుచు రణభూమి నుండి పైకి నిల్చె ననియు దానికి భీమన సంతసించి యారణతిక్కనను పునర్జీవితుని జేసె ననియు నొకకథ గలదు. ఆసమయంబున భీమకవి చెప్పినపద్య మీక్రింద వివరింపఁబడును గాక.

క. గుణములనిధాన మగుమనరణతిక్కఁడు తాఁ గళేబరంబును శిరమున్
   గణకమెయి గలియ బ్రతుకును, ప్రణుతాఖిలవైరిమకుటభానేతపదుఁడై.

అనినవెంటనే తిక్కన సజీవుఁ డయ్యె నను మొదలగుసంగతులు తెల్పునొకకథ గలదు. అది యెంతవఱకు నమ్మఁదగునో ఆలోచింపవలసి యున్నది. ఈకథ పరశీలించి చూడఁగా నన్నయభట్టారకుఁడు, భీమకవి, తిక్కనకవితండ్రి యగు కొమ్మనామాత్యాదులు నేకకాలీను లని దేశంబునం గలప్రతీతినిబట్టి యిది కల్పింపఁబడియైన నుండవలెను లేదా కొంచె మెచ్చుతగ్గు కాలములో నన్నయతిక్కనాదు లున్నట్లుగా గ్రంథదృష్టాంతములు కాన్పించుచున్నవి గనుక నితఁడును భీమకవిసమకాలీనుఁడై యైన నుండవలెను. పైద్వాత్రింశన్మంత్రిచారిత్రములో నీరణతిక్కన తిక్కనసోమయాజితమ్ముం డనియు నితనితండ్రి కొమ్మనయే యనియు, నితనిని సిద్ధన యనుకొమ్మన యన్న పెంచుకొని నట్లును సూచింపఁబడినది. ఈకథ కేవలము కల్పిత మని చెప్పుట కాధారము లేవియుఁ గానరావు. రణతిక్కనచారిత్రములో నాకథలో నుండు భేదాభిప్రాయంబులు చూపెదము. భీమకవిచారిత్రము వ్రాసి యుంటి