పుట:Kavijeevithamulu.pdf/394

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

388

కవి జీవితములు

డంబులపై ధార వోయించె ననియు వాడుక గలదు. దీనిచే వసుచరిత్ర కృతినాయకుం డగుతిరుమలరాయండు కృష్ణరాయలకుం బూర్వంబే మృతి నొందినట్లు తేలుచున్నది. ఈరాజు కృష్ణరాయలకుఁ బూర్వుండు కాఁ డనియును గృష్ణరాయనియనంతరము రాజ్యము చేసిన యళియరామరాజుతమ్ముం డనియు నీవఱకే మనము చెప్పియుంటిమి. కాఁబట్టి కృష్ణరాయలకంటెను వసుచరిత్రకృతిపతి పూర్వమే మృతి నొందె ననుట యెట్లు సరి యగును.

(2) ఒకవేళఁ గృష్ణరాయలకాలంబున నీవిఘ్నంబు వచ్చుటంజేసి రామభూషణుం డపుడు దీనిం బ్రకటింపక కాలాంతరమునఁ దిరుమలరాయనికిఁ గృతియిచ్చె నని యోఁచింతము. అ ట్లయినఁ దొల్లి తనకు నవ యశస్సుం దెచ్చిన "శ్రీభూపుత్రి వివాహవేళ" అను కృతిముఖ పద్యంబు మార్చి దీని రామభూషణుఁ డొరులకుఁ జూపునుగాని తనతప్పుం జెప్పుపద్యంబుమాత్ర మం దుంచి కడమపద్యంబులు కృతిముఖంబున మార్పఁడుగద. కావున నిదియు లెస్సయై యుండలేదు.

(3) కృష్ణరాయని యనంతరము తత్సింహాసనాసీనుం డగునీతిరుమల రాయనికడ రామలింగము మొదలగుకవు లున్నారు. కావున నప్పుడే యీగ్రంథంబు రచియించి తేఁ గని రామలింగ మాక్షేపించినాఁ డని యూహింతము. అ ట్లయిన నిది మృతు లగునితరవంశీయులకు నీఁబడియె ననుమాటయుఁ, దీనిఁ బిండంబులపై ధారావోయించె ననుమాటయు బూటకమే యని చెప్పవలయును. ఈవృత్తాంతము కల్పిత మని చెప్పుటయే నిజముగఁ గాన్పించును. రామకృష్ణుండు తొంటియాక్షేపణముఁ జేసియుండిన నుండుగాక. రాజు నాఁడుగాకున్న మఱునాఁడైన రామలింగనిచేష్ట లవి యని యూహించి మరల గ్రంథమును దనంతట తానే వినకుండునా. కావున నీకథ నెంతమాత్రమును నమ్ముట న్యాయముగాఁ గాన్పించకున్న యది.