Jump to content

పుట:Kavijeevithamulu.pdf/387

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామరాజభూషణకవి.

381

ర్వురు నొక్కరే యని చెప్పుటకు మిక్కిలి సంశయంబు గల్గుచున్నది. ఇట్టిసంశయములు నివారింపఁబడుటకు నీగ్రంథంబులుగాక యింకొక గ్రంథ సహాయంబు గావలసివచ్చెను. ఈవిషయమున మనము యుక్తిచే దీని సాధించినను గ్రంథదృష్టాంతముగూడఁ జూపిన మేలై యుండు నని భట్టుమూర్తిచే రచియింపంబడె నను గ్రంథంబులఁగూర్చి యత్నంబు సేయఁ జిరకాలంబునకుఁ దాళపత్త్రగ్రంథం బొకటి "హరిశ్చంద్రనలోపాఖ్యానంబు" అనుద్వ్యర్థికావ్యంబు సంప్రాప్తం బయ్యె. దానియాశ్వాసాంతగద్యలఁ బరికించుచో వసుచరిత్రంబున నున్నట్లే కాన్పించె. అపుడు కొంత మనంబున నిందైన రామభూషణుఁడు తండ్రిపేరు చెప్ప కుండునా యని యూహించి గ్రంథానుక్రమణికం జూడ నీక్రిందిపద్యం బున్న యది. దానిచే మనసంశయంబు లన్నియు నివారింపఁబడియె. ఆపద్యం బెద్దియనిన :-

"సీ. వనదిలంఘవకృపావార్థితోభయకవి, తాకళారత్న రత్నా కరుండ
      సకల కర్ణాట రక్షాధురంధర రామ, విభు దత్త శుభచిహ్నవిభవయుతుఁడ
      వసుచరిత్రాది కావ్యప్రీత బహునృప, ప్రాపితా నేకరత్నప్లవుండ
      శాశ్వత శ్రీవేంకటేశ్వరానుగ్రహ, నిరుపాధికైశ్వర్యనిత్యయశుఁడ

గీ. శ్రీ మహాప్రబంధాంకసింగరాజ, తిమ్మరాజ ప్రియతనూజ ధీరసూర
    పాత్మజుఁడ రామభూషాఖ్యఁ బరఁగుసుకవి, నంకిత మొనర్తునీకావ్యమనఘభక్తి"

దీనిచే నీతనివంశంబు దెలసె. ఇఁక భట్టుమూర్తివంశంబు దెల్పుపద్యంబు నిట వివరింతము.

గీ. అమితయమకాశుధీప్రబంధాంకసింగ, రాజసుతతిమ్మరాజపుత్త్రప్రసిద్ధ
    నరసవేంకటరాయభూషణసుపుత్త్రు, నను బుధవిధేయు శుభమూర్తినామధేయు.

ఇపు డీరెండుపద్యంబులంబట్టి చూడ నీయిర్వురకు మూలపురుషుం డొక్కం డనియు నీయిద్దఱుఁ బినతండ్రి పెదతండ్రి కుమారు లనియు స్పష్టం బయ్యె. ఇట్టి వృత్తాంతంబే మఱియును స్పష్టం బగునటుల నీక్రిందివంశవృక్షముం జూపెదను.