పుట:Kavijeevithamulu.pdf/371

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామరాజభూషణకవి.

365

ఈరెండుపద్యములం జూచినచో నీరెండు గ్రంథములు కవులకుఁ గలప్రజ్ఞా భేదము స్పష్టము కాఁగలదు. వసుచరిత్రములోఁ గలసంగీతరహస్యములం దెల్పుపద్యములు పెక్కు లున్నను అట్టిపద్యములు నరసభూపాలీయములో నుండుటకు ననువు లేక యుండుటంబట్టి రెంటిని విరళించి చూపునవకాశము లేక యున్నది. అయినను వసుచరిత్రములోని యింకొకపద్యముం జూపి యీవిషయమై వ్రాయుట వదలెను.

మ. అరిగాఁ బంచమ మేవగించి నవలా లవ్వేళ హిందోళవై
     ఖరిఁ జూపన్ పికజాత మాత్మరవభంగవ్యాకులం బై వనీ
     ధర నాలంబిత పల్లవవ్రతవిధుల్ ద్రాల్పన్ తదీయధ్వనిన్
     సరిగాఁ గైకొనియెన్ వసంతము మహాసంపూర్ణభావోన్నతిన్.

ఈయిర్వురుకవులకుం గలప్రజ్ఞల స్పష్టీకరించుటకుఁ గొన్ని ప్రతీతులు గూడ పుట్టియుండును. వానిలో వసుచరిత్రకవి ప్రస్తుతపువీణియలమెట్లలోఁ జేసినవిశేషాదిక మతని సంగీతవిద్యాప్రాగల్భ్యముం జూపుటకును నరసభూపాలీయకృతికర్త అయ్యలరాజురామభద్రకవి నాక్షేపించఁబోయి

"పృథులషడ్జస్వనోదీర్ణభిల్లపల్ల, వాధరీగీతికాకర్ణనాతిభీత,
 పరవశాత్మపటీరకోటరకుటీర, లీనఫణి యగునక్కాన కాన నయ్యె"

అనుపద్యములోనిసంగీతసంప్రదాయము తెలియనివాఁడై సభలో నవమానించఁబడె ననుకథలోని న్యూనతయును, పైవృత్తాంతముల బలపఱుచుటకుం జాలియుండు.

ఇ ట్లుండుటం బట్టి పైపద్యములో నుపయోగింపఁబడిన విశేషములు కొన్ని భిన్నములుగా నున్నను, పరస్పరవిరుద్ధము లైన వేవియును లేనందున వానినిఁ బట్టి గ్రంథకర్తలు భిన్ను లని సాధించుట కాధార మేదియు లేదు" అని వీరేశలింగముగారు చేసినసిద్ధాంత మందఱివలెనే స్థూలదృష్టితోఁ జేసినది కాని శ్రమచేసి సూక్ష్మదృష్టితో నాలోచించినది కా దని చెప్పవలసినందులకు వగచుచున్నాను. కాఁబట్టి ఆసిద్ధాంతము మనస్సునం దుంచుకొని వ్రాసియున్న తరువాయి వచనము లన్ని నిరస్తములయ్యె నని వక్కాణించెదను.