పుట:Kavijeevithamulu.pdf/370

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

364

కవి జీవితములు

    సోమప్రసాదంబు సోమయాజుల, నియమంబు భాస్కరుని సన్మార్గఘటన
    శ్రీనాథునిపదప్రసిద్ధధారాశుద్ధి, యమరేశ్వరుని సహస్రముఖదృష్టి

తే. నీక కల దటుగాన నేనేకవదన, సదనసంచారభేదంబు సడలుపఱిచి
    భారతీదేవి నీజిహ్వఁ బాదుకొనియె, మూర్తిరవిచంద్ర విఖ్యాతకీర్తిసాంద్ర

ఈపద్యముం బట్టి చూడ నీకవి వీనినన్నింటిని డంబమునకై చెప్పియుండునా యని తోఁచకపోదు. కాని పరిశీలింప నట్లనుటలో న్యాయము లేదు. ఇతనికడ ననేకు లగుకవులలో నరిదిగఁ గన్పడుప్రజ్ఞలు చాలగ నున్నవి యనియు నది కారణముగా నీతఁ డాయాగుణములు గలకవులపేరులు చెప్పి వర్ణించినాఁ డనియుం జెప్పఁదగియున్నది. ఇట్టి ధైర్యశాలి గనుకనే 'లొట్ట యిదేటిమాట, యను పద్యముం జెప్పె.

ఇఁక వసుచరిత్రకారుఁడు వసుచరిత్రములోఁగాని హరిశ్చంద్రనలోపాఖ్యానములోఁగాని చెప్పుకొనినబిరుదులు సర్వకవిసామాన్యధర్మము లైనవగుటంజేసి యట్టివానింగూర్చి సాధారణముగాఁ జెప్పుకొని తనకవిత్వమందుఁ దా జెప్పినవిశేషములు విస్పష్టముగాఁ గాన్పించునట్లు చేసెను. అందులో నరసభూపాలీయకవి యత్నించలేనివి సంగీతవిద్యా సంప్రదాయవివరణము. ఇయ్యది కవి కనువైనపు డెల్లనాతనిచేఁ బ్రకటింపఁబడియె. అందు సంగీతవర్ణన లున్న పద్యములు రెంటిని జూపెదను.

మ. సకలామోదకతాళవృత్తగతులన్ సంగీతసాహిత్యనా
     మకవిద్యాయుగళంబు పల్కుఁజెలికిం బాలిండ్ల జో డైసిరుల్
     ప్రకటింపన్ నఖరేఖలందు నలఘుప్రస్తారము ల్సేయుస
     ర్వకళాకాంతుఁడు బ్రోవుతన్ దిరుమలేంద్రశ్రీమహారాయనిన్.

                      వసుచరిత్రము. అశ్వా 1. ప 3

సీ. ఒకటి యక్షరవిలాసోల్లాసమున మించ, నొకటి తాళప్రౌఢి నుల్లసిల్ల
    నొక్కటి నారికేళోన్నతిఁ దాల్ప నొ, క్కటిగో స్తనీగుచ్ఛకలనఁ దనర
    నొకటి సువృత్తభావోన్మేష మొంద నొ, క్కటి వల్లకీతుంబికలనఁ జెలఁగ
    నొకటి భారవిశేషయుక్తిఁ బెం పొంద నొ, క్కటి గిరీశమతానుకారిగాగ
    నపమసాహిత్యసంగీతరసము లనెడు, గుబ్బపాలిండ్లు దాల్చుపల్కులవెలంది
    సరసగుణహారునో బయనరసధీరు, నవ్యకృతినాయకుని గా నొనర్చుఁగాత.