పుట:Kavijeevithamulu.pdf/366

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

360

కవి జీవితములు

రిశ్చంద్రనళోపాఖ్యానకృతి రచియించి దీనిని శ్రీరామునకే సమర్పింప నుండె నని తేలినది.

ఇట్లు చెప్పి దానితోఁ దృప్తి నందక ఆగ్రంథములోనే రామాయణకథ నంతయు నిరువదేడుపద్యంబులు గలనక్షత్రమాలికగా నొనరించి రామునకు సమర్పించె. ఇది వసుచరిత్రము, హరిశ్చంద్ర నళోపాఖ్యానము రచియించినకవియొక్క రామభక్తి కథాసంగ్రహము.

ఇఁక నరసభూపాలీయకవికిఁ రామభక్తి యెంతవఱ కున్నదో దాని నాలోచింతము. అందు ప్రథమపద్యము.

"శా. శ్రీలీలావతి తా సురోమణిసభాసింహాసనత్కౌస్తుభా
      వేలాభాప్రతిబింబితాంగి యయిన న్వేఱొక్కతం దాల్చినాఁ
      డౌలే యంచుఁ దలంచునో యని యమందానందుఁ డై లక్ష్మి నే
      వేళం గౌఁగిటఁ జేర్చుశౌరి నరసోర్వీనాథునిం బ్రోవుతన్."

ఇందలిస్తోత్రము వైష్ణవపరమైనను అది కేవల మర్చావతారమగు శ్రీరామవర్ణనముగాక పరమపదనాథుఁ డై లక్ష్మీసనాథుఁ డై యుండిననారాయణుని వర్ణన యై కానుపించును. దీని ననుసరించియే క్రిందిపద్యములో సముద్రమునకు పుత్రికయై చందురునకు సోదరియై, కందర్పునకుం దల్లియై ముకుందసుందరి యైనయిందిరాసుందరి వర్ణింపఁబడినది. ఈదేవి అవతా రాంతరమందు సీతామహాదేవి యైన రామోపాసకులవలన నిట్లు వర్ణింపఁబడదు. అటనుండి సర్వప్రబంధ సామాన్య దేవతావర్ణనలు కొన్ని రచియింపఁబడినవి. అటుపిమ్మట తనకుఁ బ్రధానోపాస్యదైవం బగునాంజనేయునిమాత్ర మీక్రిందివిధంబున వర్ణించెను.

సీ. తనయాస్యగహ్వరంబునకు ఖద్యోతజృం, భణము ఖద్యోతజృంభణము గాఁగ
    తనక రాంభోజాతమున కలగంధమాదన, మొకగంధమాదనము గాఁగ
    తనశౌర్యహర్యక్షమునకు మైరావణ, స్ఫురణ మైరావణస్ఫురణ గాఁగ
    తనవాఁదంభోళి కెనయు కర్బురగోత్ర, గరిమ కర్బునగోత్రగరిమ గాఁగ

తే. వరలు రామానుజన్మ జీవప్రధాన, ధుర్యపర్యాయధాత మేదురవిరోధి
    బలపయోధి విలంఘనప్రబలశక్తి, యోబయనృసింహభూభర్త కొసగుఁగాత.