పుట:Kavijeevithamulu.pdf/360

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
354
కవి జీవితములు

శ్రీకరమహాప్రబంధాంక సింగరాజ, తిమ్మరాజప్రియతనూజదీరసూర
పాత్మజుఁడ రామభూషాఖ్యఁ బరగుసుకవి, నంకిత మొనర్తు నీకావ్య మనఘభక్తి.

వసుచరిత్రము.

మ. నను శ్రీరామపదారవిందభజనానందున్ జగత్ప్రాణనం
      దనకారుణ్యకటాక్షలబ్ధకవితాధారాసుధారాశిసం
      జనితైకై కదినప్రబంధఘటికాసద్యశ్శతగ్రంథక
      ల్పను సంగీతకళారహస్యనిధిఁ బిల్వం బంచి పల్కెం గృపన్.

మూఁడుపద్యము లుదాహరింపఁబడినవి. కాని యీమూఁటికి సహచరములుగా నున్నయాశ్వాసాంతగద్యములలో నున్న విశేషము లీస్థలములో నుదాహరింపఁబడనందున వానింగూడ నిటఁ జేర్చి యనంతర మందులోనిభేదా భేదగుణంబులం జూపెదను.

నరసభూపాలీయము.

4. "ఇది శ్రీహనుమత్ప్రసాదలబ్ధకవితాసార, సారస్వతాలంకార, నిరంకుశ ప్రతిభాబంధుర ప్రబంధరచనపఠనధురంధర, ప్రబంధాంక వేంకటరాయభూషణ సుపుత్త్ర, తిమ్మరాజపౌత్త్ర, సకలభాషావిశేషనిరుపమావధాన శారదామూర్తి మూర్తిప్రణీతము"

వసుచరిత్రము.

5. "ఇది శ్రీరామచంద్రచరణారవిందనందన, పవననందనప్రసాదసమా సాదిత సంస్కృతాంధ్ర భాషాసామ్రాజ్య సర్వంకష చతుర్విధకవితానిర్వాహక, సాహిత్యరస పోషణ రామరాజభూషణ ప్రణీతము"

ఇట్లు పైగ్రంథములలోఁ జెప్పంబడినకవిత్వవిశేషములఁ బర్యాలోచించుట కొక్కొకదానినే పరిశీలించి చూచెదము.

అందులో నరసభూపాలీయ సంబంధులు.

1. శతలేఖీనీపద్యసంధాన ధౌరేయత = అనఁగా శతఘంటకవిత్వము చెప్పెడు నేర్పు.

2. ఘటికాశతగ్రంథకరణశక్తి = అనఁగా గడియకు నూఱునుష్టుప్పు (శ్లోకము)లు రచియించుప్రజ్ఞ.

3. ఆశుప్రబంధ, బంధాభిజ్ఞత = ఆశుధారగా (Extempore) ప్రబంధములు చెప్పుట, అటులనే బంధకవిత్వము నుడువుట.

4. ఓష్ఠ్య, నిరోష్థ్యజ్ఞత = పెదవులు తగులునటులను అవి తగులనటులను కవిత్వము చెప్పుట.