పుట:Kavijeevithamulu.pdf/355

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పింగళిసూరన.

349

నని చెప్పినకల్పన యుక్తియుక్తమై యున్నట్లు కానరాదు. ఇంతియ కాక ఆసందర్భములోనే నారదుఁడు తనసంగీతంబును కృష్ణమహిషులు వర్ణించుట వినియు నది ముఖప్రీతి కా నోవు నని యూహించి దాని నరయుటకై కలభాషణిం గోరఁగా నాపె కామరూపంబు వేఁడి దానిఁ గైకొని కృష్ణమహిషుల సఖీరూపంబు దాల్చి పోయి నారద సంగీతవిశేషంబులం గూర్చి ప్రశంసించి వారు దానిని నిజముగ స్తోత్రముచేయుటయే యని మరలి వచ్చి నారదునకుఁ దెల్పెనని తెల్పినకథ కలభాషణికి నారదుఁడు కామరూపశక్తి యిచ్చుటకుఁ గారణరూపముగాఁ జెప్పంబడినను తా నెవ్వరికడ మూఁడుసంవత్సరములు విద్యాభ్యాసము చేసెనో వారు తనసంగీతమును స్తోత్రముచేయుదు రని చేసినకల్పితయుక్తికిని శాస్త్రమునకుంగూడ సరిపడనిది యై యున్నది.

ఇటులనే తుంబురుని జయించుటకుఁగాను నారదుఁడు యత్నించి తపంబు చేసి విష్ణునివలన వరంబు గొనినకథయును గానుపించును. అటుపిమ్మట మణికంధరుతపః ప్రభావంబును సిద్ధునిసమావేశంబును చిలుక కథయును, సందర్భశుద్ధములుగాఁ గానుపింపకుండుటయే కాక లోకసామాన్యములుగాఁగూడ కాన్పింపవు. ఇటులనే వ్రాయందొడంగిన గ్రంథంబులోనిగాథ లన్నియు పరస్పరసందర్భము లేకయు, నమ్మ నర్హములు కాకయు పరిశీలనము చేయం జేయ నసారంబులౌను. కాని మనుచరిత్రాదికములోఁ గల్పింపఁబడిన కల్పనల విథంబున యుక్తినహంబు లై యుండవు. కావున నిఁక నింతటితో నీకథాసందర్భములంగూర్చి వ్రాయ విరమించెదను.