పుట:Kavijeevithamulu.pdf/348

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

342

కవి జీవితములు

న పురవర్ణనమునకు మొదలనే యక్కఱ కాదు. పురమును వర్ణించునపుడు క్రిందనుండి మీఁదికి వర్ణించువారు కొందఱును మీఁదినుండి క్రిందికి వర్ణించువారు మఱికొందఱు నైయున్నారు. ఆచేయుచున్నవర్ణనాంశములో నేదియైన క్రొత్తత్రోవ యలవడిన నందుఁ జేయువర్ణనము కొంచెమయిన గొప్పగా నుండును. క్రిందినుండి పైకి పురమును వర్ణించుమార్గదర్శి యగుటకు నాముక్తమాల్యదాకారుఁడు.

"అడుగున నుండియున్ బదిలమై చెద లంటెడుకోట నొప్పుప్రోల్"

అని మొదలిడెను. సూరన పైనుండిపట్టణము చూచిన నెట్లుండునో దానిని నూహించి వర్ణించుట విశేషములోనిది కాదుకావున సూరనయు పురవర్ణనము చేసినవాఁడే.

9 ఉ. ఇతఁడు కవితాప్రశంసలోఁ దనకావ్యములందుఁ గొన్ని లక్షణములు వ్రాసియున్నాఁడు. ఇం దలంకారశాస్త్రజ్ఞానమును వెల్లడిచేసినాఁడు.

చా. సూరనకవి యుదాహరించినపద్యము నిట వివరించి యనంతర మందలివిశేషములు పైయుపన్యాసకుని యభిప్రాయములతో నెట్లు సరిపడియుండువో తెలియపఱిచెదను.

సీ. పొసఁగ ముత్తెపుసరుల్ పోహళించినయట్ల, తమలోనఁ దొరయుశబ్దములఁ గూర్చి
    యర్థంబు వాచ్య లక్ష్య వ్యంగ్యభేదంబు, లెఱిఁగి నిర్దోషత నెసఁగఁజేసి
    రసభావములకు నర్హం బుగ వైదర్భి, మొదలైనరీతు లిమ్ముగ నమర్చి
    రీతుల కుచితంబు లై తనరారెడు, ప్రాణంబు లింపుగాఁ బాదుకొల్పి

గీ. యమర నుపమాదులును యమకాదులు నగు, నట్టియర్థశబ్దాలంక్రియలు ఘటించి
    కవితఁ జెప్పంగ నేర్చుసత్కవివరునకు, నభిమతార్థంబు లొసఁగనివారు గలరె.

అను నీపద్యములో నుడువఁబడిన వెవ్వి యన :-

1. అర్థ మెఱుంగుట.
2. లక్ష్య మెఱుంగుట.
3. వ్యంగ్య మెఱుంగుట.
4. రస భావముల కర్హం బగు వైదర్భి మొదలగురీతులు చేర్చుట.
5. రీతుల కుచిత మగుప్రాణంబు లుంచుట.
6. ఉపమాదులఁ గూర్చుట (అర్థాలంకారములు)
7. యమకాధులఁ జెప్పుట (శబ్దాలంకారములు)