పుట:Kavijeevithamulu.pdf/346

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

340

కవి జీవితములు

చా. దీనిఁ గారణములు చెప్పింనంగాని అంగీకరింప వీలుపడదు. సూరనయెడ నిబంధనకారుల కేమి యభిప్రాయము కలదో అది ప్రమాణముగాని ఆధునికులలో నొక రిద్దఱి యభిప్రాయము గణనీయము కానేరదు. పెద్దనకూడ నీసూరనకుఁ జాలువాఁడు గాఁ డనుట ఆయిర్వురికవితాతారతమ్యము లెఱుఁగక పోవుట యై యుండును.

3 ఉ. కాళిదాసుకవిత్వమం దపారగౌరవ ముంచియున్నాఁడు గనుకనే యితఁడు లాతికవులవలెఁగాక రసవంత మగుకావ్యరచనకు సమర్థుఁ డైనాఁడు.

చా. దీనికి సమాధాన మిదివఱకే చెప్పియున్నాఁడను. లాతి కవుల కావ్యములు రసవంతములు కా వనియు నితనికవనమొక్కటి యే రసవంత మైన దని చెప్పుట కేవల మనృతమైనఁ గావలె లేకున్న పక్షపాతవృత్తి యైనం గావలెను.

4 ఉ. ఇతఁడు నాటకాలంకార సాహిత్యము కలఁవాఁడు. ఇతఁడు సంస్కృతమున శాస్త్రాభ్యసనము చేసినట్లు కనుపించుచున్నది.

చా. ఇది సర్వప్రబంధకవిసామాన్యలక్షణమే కాని విశేషమైనది కాదు. సంస్కృతశాస్త్రాభ్యసనము చేయని ప్రసిద్ధప్రబంధకవు లెవ్వరును లేరు.

5 ఉ. రాఘవపాండవీయమునందు నయోధ్యాహస్తిపురములను వర్ణించినాఁడు. అంతటను కథాభాగములను వర్ణించినాఁడేకాని ఛాందసవృత్తిఁ గైకొని నిరుపయోగము లగువర్ణనములను జేయలేదు.

సూరనకవి రెండుకథలను కల్పిగ్రంథముచేయు భారమునందు మునిఁగి యున్నాఁడుగావునను, అది ప్రథమప్రయత్నము కావునను దృష్టి, కథాసందర్భముఁ గూర్చుటయందే వినియోగించెఁ గావునను తక్కినవర్ణనలు సాధ్య మగునంతవఱకు తగ్గించి యుండును. కాని వర్ణనలయందలియసూయచేతఁగాని లేక యాధునికాభిప్రాయము దివ్యదృష్టిం జూచుటచేఁతగాని కాదు.

6 ఉ. రామరాజభూషణకవి తనహరిశ్చంద్రనలోపాఖ్యానమునఁ బూరవర్ణన చేసి దానికిం దోడుఁగ బెక్కువర్ణనల వర్ణించినాఁడు.