పుట:Kavijeevithamulu.pdf/345

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
339
పింగళిసూరన.

11 ఉ. చక్కనిజవరాలికి శరీరమం దంతట తొడవులు తొడిగినచో నెట్టులుండును. అట్లు గాక ప్రశస్తము లగురెండుమూఁడు తొడవు లాయాచోటులం గైచేసిన నెట్టు లుండును.

చా. ఈయుదాహరణము లోకానుభవముం బట్టి వ్రాయఁబడవలయును. శరీరమంతయు కనకాంగివిధముగ నగలుంచుట అసహజమే గద. ఇఁక నగ లెక్కువ తక్కువగా నుండినచోఁ గల్గుస్త్రీ సౌందర్యాదికములు దేశానుసారములై యుండును. ఆంధ్రులు వివిధము లగునలంకారములచేతంగాని తనియరు. ద్రావిడదేశస్థులు దీనికి వ్యతిరేకాభిప్రాయులు. ఆంధ్రులలోఁ గొంచెమునగ లుంచికొనుట మంచిది యని యే స్త్రీయును బల్కఁ జూడము. ధనాధికారము లేక తొడవులు తొడిగింప నెట్లు సాధ్యము కాదో అటులనే ఆంధ్రులలో సాహితీరసపోషణాధికారము లేక కవితాయువతిని భూషణభూషితం జేసి సంతసింపం జేయరాదు. కావ్యాలంకారసంగ్రహములో

క. తను వగు శబ్దార్థంబులు, థ్వని జీవ మలంక్రియావితానము సొమ్ముల్
    తనరుగుణంబులు గుణములు, ఘనవృత్తులు వృత్తు లౌర కావ్యేందిరకున్.

అని యున్నది. కావున నాంధ్రసరస్వతి రెండుమూఁడు తొడవులతో సంతోషించునది కా దని నిష్కర్షించెదను.

కాలీనుల కవిత్వమున కున్నదశను సూరన వృద్ధి నొందించినవిధము.

1 ఉ. ఈకవి తనకవితాకన్యకకుఁ దొడవులు తొడిగి మెఱయింపలేదు. ఆమె స్వభావసౌందర్యమునే వెల్లడిచేసినాఁడు.

చా. ఈయభిప్రాయ మేమియు సరియైనది కాదు. సూరనకవి కావ్యాలంకారములం గైకొనియుండలే దనుమాట కాధారములు లేవు. ద్వ్యర్థికావ్య మగురాఘవపాండవీయములోఁ గూడ నీకావ్యాలంకారములు మెండుగ నున్నవి. ప్రభావతీప్రద్యుమ్నము కేవలము ప్రబంధమే. కళాపూర్ణోదయము కల్పనాకథ యైనను అందు ననేకాలంకారము లుండినవి.

2 ఉ. మాధ్యమికకవు లందఱిలోను సూరనతో సరి యగునంతటివాఁ డొక్కదైన లేఁడు. పెద్దనకూడ లొఁగువాఁడే అని నాతలంపు.