పుట:Kavijeevithamulu.pdf/344

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
338
కవి జీవితములు

తులందఱుఁ గలసి యొకయంశముంగూర్చి రెండాశ్వాసములవర్ణనముం జేయ గమకింపుఁ డని ప్రార్థించెదను. వా రట్లుచేయఁజాలినప్పుడుగదా రామభూషణునికష్టము వృధ యై పోవును.

9 ఉ. రసపుష్టి నొక్కశబ్దముచేతనే కలిగింపవచ్చును. దాని నమితముగా వర్ణించినచో నది విరస మై పోవును.

చా. అది నిజమే అయిన గొప్పశక్తియే ! రసపుష్టి యనునది యే రెండుమాటలు గలది. ఇఁక రసపుష్టి నొక్కమాటచేఁ గల్గించుట యెట్లో నాకు గోచరంబు కాకున్నది. కవిత్వవ్యవసాయము మాటలు చల్లిన ఫలియింపదు. దానికి కృషియును, నైసర్గికప్రతిభయు నుండవలయును. అపుడుగాని రసోదయము కాఁజాలదు. అట్టిరసాస్వాదనము ప్రారంభకులకు ముఖసిధానము చేయును. అపుడు విరసమగునేమో కాని అభ్యాసవంతులకు మధురరసాదులవలెఁ బ్రౌఢులకు కావ్యరసము కడుం గడుఁ బ్రీతి గావించు. అట్టివారిం దనియించువాఁ డందఱికంటెను రస లోలుఁడై యుండవలయును. కావుననే రామరాజభూషణునకు సాహిత్యరసపోషణుఁ డనుబిరుదు కల్గినది. రసము తెచ్చిన నతఁడే తేవలయునుగాని యిఁక నన్యులవశ మగునా ?

10 ఉ. స్వాభావికము లగువర్ణనలు పెక్కు లుండిన మనోహారముగా నుండునుగాని మిథ్యావాదము లగుమత్ప్రేక్షాతిశయోక్తులు మితి మీఱ వర్ణించినచో నది మనసూన కానంద మీకుంటయకాక వేసటఁ గల్గించుటకుఁగూడ మూలము లగును.

చా. ఇక్కడ స్వాభావికము లగువర్ణన లన నా కర్థము గోచరంబు కాలేదు "శుష్కేమూలంతిష్ఠత్యగ్రే" అనునట్టివి స్వాభావికవర్ణనములు. ఇట్టివి ప్రబంధములలోఁ జేర్పఁబడకపోవుటకుఁ గారణ మేమైన నుండవచ్చును. కేవలము వర్ణనాంశముల కే యిది యేర్పడినది. వలయునేని స్వాభావికవర్ణనలు పురణాదికములలోఁ జూడఁదగును. ఉత్ప్రేక్షాతిశయోక్తులు మనస్సున కానంద మీయకుంటయే కాక వేనటఁ గూడ గల్గించు నన దీనికి వ్రాయవలసినసమాధానము లేదు. ఇది పండితానుభవవేద్యము.