పుట:Kavijeevithamulu.pdf/343

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పింగళిసూరన.

337

జనసామాన్యధర్మమేను. ఇఁక నతివిస్తారములన్నచో నది రామరాజభూషణ సాహిత్యబలమునే చూపును. సామాన్యముగ నొక్కొకవర్ణనకు రెండేసి మూఁడేసి పద్యములకంటె నధికముగా నితరకవులు చెప్పలేదు. పెద్దనకవిమాత్రము పదివఱకుం జెప్పె. ఆవిషయములో నాలోచింపఁగా రామరాజభూషణుఁడు ముప్పది పద్యములు నలుబది పద్యములు చెప్పుటచేఁ బెద్దనకంటెఁ గూడ నీతఁడు కల్పనాశక్తియందనేక మడుఁగు లాధిక్యత నందినవాఁడని చెప్పవలయును. ఈవర్ణనలనునవి ముప్పదిముప్పది విధములుగ నున్నవికాని యొకదానిం బోలినది యొకటికాదు. ఒకదానికంటె నొకదానియందు విశేషము లున్నవి. ఒకటిరెండుపద్యములం జూపెదను.

మ. హరిదంభోరుహలోచనల్ గగనరం గాభోగరంగత్తమో
     భరనేపథ్యము నొయ్యనొయ్య సడలింపన్ రాత్రి శైలూషికిన్
     వరుస న్మౌక్తికపట్టమున్ నిటలమున్ వక్త్రంబునుం దోఁచె నా
     హరిణాంకాకృతి వొల్చె రేకయి సగం బై బింబమై తూర్పునన్.

శా. ఉదయోలూఖల మెక్కి నిక్కి సహజాంకోసేంద్రసంయుక్తుఁ డై
     చదలన్ బూదశశాంకసీరి కరవిస్తారంబులం బట్టి బి
     ట్టదుమన్ గాఱెఁ జకోరగోపతతిపా లై చంద్రికాక్షీరముల్
     పొదలెన్ ఘూర్ణితదుగ్ధధామనిబిడప్రోద్భూతసంరంభముల్.

ఇట్టివర్ణనలోఁగూడ నెక్కడనో పదియునైదుగాని తక్కినచోటుల రెండుమూఁడు చెప్పి పైకిఁ బోవుచు వచ్చెను. చమత్కరించుట కవధియున్నంతవఱకుఁ జమత్కరించుటయే రామరాజభూషణుని కోర్కె గాని సంగ్రహించి చెప్పుట యాతనిమార్గము కాదు. నాయికానాయకుల విరహాదశావర్ణనమున రెండాశ్వాసములు వ్రాసి కాలము గడపినాఁడేకాని కథాంశముల వర్ణించి రసము పుట్టించినవాఁడు కాఁ డనుదానికిఁ బైనసమాధానమే చాలియుండును. ఇది కథాంశవర్ణన కై యేర్పడినకావ్యము కాదు. విరహదశావర్ణన లెవ్వ రెంతవఱకుఁ జేయఁగలరో అట్టిమనోదార్ఢ్యములు చూపుకొనుటకై రచియింపఁబడిన వర్ణన లై యున్నవి. ఆగ్రంథము చూడకుండ నిప్పటికాలములోఁ బండి