పుట:Kavijeevithamulu.pdf/340

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

334

కవి జీవితములు

స్కృతములోని కావ్యనాటకములు నలంకారములు తెనుఁగులోనికిఁ దెచ్చెడిప్రబంధకవులుమాత్రము సంస్కృతము నెందు కవలంబించఁ గూడదు. అటులనే కాకున్న సంస్కృతములోనియలంకారములకు నాంధ్రమున నిష్ప్రయోజనత్వము తటస్థించును. ఆంధ్రభాష తత్సమ తద్భవ దేశ్యాత్మక మై యున్న దనినచో నీమూఁడును కల్పి యైనఁ జెప్పవచ్చును. దేని కది విడఁదీసియైనఁ జెప్పవచ్చును. ప్రబంధములలోఁ బ్రత్యేకము వర్ణనాంశములే ప్రధానములు గావున నిట్టివర్ణ నాంశములలోఁ గొన్ని సంస్కృతజటిల మగుటచేతనే రసావిర్భావ మగుటయు, శ్రావ్య మగుటంబట్టి ప్రబంధకవులందఱు నట్టిత్రోవ నవలంబించిరి. కాఁబట్టి ప్రబంధము లనుపేరితో నొప్పుగ్రంథము లట్లె యుండవలెంగాని వేఱుగ నుండఁగూడదు. ఇట్టి విశేషములు లేని నవీనులప్రబంధములు పండితా దరణీయములు కాక సామాన్యగౌరవమున నొప్పియున్నవి. కావున గ్రంథగౌరవమే కోరువారు ఆంధ్రచిహ్నములు లేనిలోప మెంచ రని తలంచెదను.

5. లే. శబ్దార్థ గౌరవ మూహించునలవాటు మాధ్యమిక కవులయందుఁ బ్రబలినది. ఇంతటినుండియుఁ గవులయందు స్వశక్తి మాటుపడినది. వీరలు తమవ్రాసినగ్రంథముల నెల్ల నొక్కరీతిగాఁ జర్వితచర్వణ మన్నట్లు వ్రాసిరే గాని తమబుద్ధివిశేషము నేనిఁ గల్పనాశక్తి నేని వెల్లడి చేసియున్నవారు కారు.

చా. ఈయాక్షేపమునందు న్యాయ మేమియుం గానివించదు. ప్రబంధమున కేర్పడినవి యిరువదియొక్కవర్ణనములు. అవి లేనిచో నది ప్రబంధము కాదు. అందు ప్రథమములో వర్ణించినవారికి సౌలభ్యము విశేషించి కలదు. ఆవర్ణనముననే వందలకొలఁది జనము చేయనారంభించిన నొకరిదానిం బోలి యొకరిది యుండకతీఱదు. అంతమాత్రముచేత ప్రాచీనులఁ జూచి నవీను లావర్ణనములనే చేసి రని చెప్పుట యుక్తియుక్తము కాదు. ఇట్టివన్నియుఁ జర్వితచర్వణము లని చెప్పుటయు న్యాయము కాదు. ఈవర్ణనాంశములయందేమి తదితరస్థలములయం దేమి ప్రతి ప్రబంధములోనను హృదయాహ్లాదకరము లగుకొన్ని కొన్ని క్రొత్తవి