పుట:Kavijeevithamulu.pdf/338

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

332

కవి జీవితములు

సారముం గ్రహించినాడఁట. ఇఁక నితనిశక్తి యే మని యనుకొన వచ్చును ? ఈశక్తి యెట్టిపనుల నొనర్చినదో చూతము."

చా. ఈమాటల కాధారము లెవ్వియును లేవు. ఇతఁడు వ్రాసినగ్రంథములన్నియు నూతనఫక్కికములే యనుట యత్యుక్తి యగును. గరుడపురాణము పురాణఫక్కి కలదే. రాఘవపాండవీయము సంస్కృతములో నంతకుఁబూర్వమున్న రాఘవపాండవీయఫక్కి కలదే. కళాపూర్ణోదయము సంస్కృతకాదంబరి ఫక్కి కలదే, ప్రభావతీప్రద్యుమ్నము ప్రబంధఫక్కి కలదే. ఇతనిశక్తి యే మని యనుకొనవచ్చు ననునంత యద్భుతమైనది కాదు సరికదా ప్రథమతః సంస్కృతాంథ్రములయందు నవీనమార్గములఁ గల్పించినమహాకవులశక్తికి నెంతమాత్రము చాలి యుండ దని చెప్పవలసియుండును.

సూరనకాలమందుఁ గవిత్వ మెట్టిదశయం దున్న దను

దానిం గూర్చి విమర్శనము.

1. ఉ. ఆంధ్రకవు లెల్లరును వారలకాలములం బట్టి ప్రాథమిక మాధ్యమి కాధునికు లని మూఁడు భాగములుగ నగుచున్నారు. ఈ మువ్వురియందును శైలీభేదము మిగులఁ గాన్పించుచున్నది.

చా. లోకమందంతటఁ బ్రాచీనులు నాధునికు లని రెండుభేదములే గాని మూఁడుభేదములు కల్గుటకు ప్రసక్తి లేదు. అట్లే అప్పకవి మొదలగునిబంధనకారు లెవ్వరును వివరించి యుండలేదు. మనము కవిత్వశయ్యావిషయములలో భేదాభేదములఁ గనిపెట్టవలయు నని కోరెద మేని యొక్కశతాబ్దములో నుండెడుకవులపదశయ్యాదులఁ బరిశీలింపవలయుంగాని నాలుగేసి శతాబ్దములలోని కవులశయ్యాదులం బోల్పఁగూడదు.

2. ఉ. భారతశైలితోడ సరితూఁగునది యాంధ్రంబున నేదియు లేదు.

చా. అట్లు చెప్పెడు మాట కర్థము లేదు. భారతశైలి మూఁడు తెన్నులుగా నున్నది. అందు నన్నయభట్టుశైలి వంటిది తిక్కనసోమయాజిది కాదు. తిక్కనసోమయాజి శైలివంటిది యెఱ్ఱాప్రెగ్గడది కాదు.