పుట:Kavijeevithamulu.pdf/33

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
21
వేములవాడ భీమకవిచాలియుండును? న్యూయల్ దొరగారిలీష్టులలో గుడిమెట్టగ్రామములో నొకకోట యున్న దనియును నందుపై నున్న శాసనములనుబట్టి యాకోట 'సాగి పోతరాజు కాకతీయ రుద్రమహారాజుగారి దని యున్నట్లును'వ్రాసి దీనియర్థమేమో యని వ్రాసియుండెను. ఆక్రిందనే పోతనృపునిశాసనమున్నదని చెప్పి యా శాసనము గాని తనకు వచ్చిననకలు గాని యసంపూర్తిగా నుండవలెననియును వ్రాసెను. ఈయనయే బెజవాడశాసనముంగూర్చి వ్రాయుచో నది శాలివాహన సం. 1121 లోనియెవ్వరో యొక పోతభూపతియొక్క యొకశాసన మని వ్రాసెను. అతని యనంతరము వచ్చిన మఱికొందఱియొక్క పేర్లు గలవంశవృక్ష మున్నట్లును చెప్పి యితఁడు చోళవంశపురాజు కానోపు నని వ్రాసియుండెను. రామ విలాస మనుగ్రంథముంబట్టి చూడ నీసాగి పోతరాజు సాగివారు, వత్సవాయవారు, భూపతిరాజువా రని మనదేశమునఁ బ్రసిద్ధిఁ జెందిన క్షత్రియులకు మూలపురుషుఁడుగాఁ గాన్పించెను. ఇతఁడు భీమకవికి సమకాలీనుఁ డని చెప్పుటకు నేవిధమయిన దృష్టాంతములును లేవు. కావునఁ గవిచరిత్రములోఁ జెప్పినప్రకార మిదియును నీతనికాలనిర్ణయమునకుఁ జాలి యుండ లేదు. మనముమాత్రము శ్రీనాథుఁడు చెప్పినపద్యము ననుసరించి భీమకవి నన్నయభట్టుకంటెను బూర్వుం డని నిశ్చయించికొందము.

సీ. వచియింతు వేములవాడభీమనభంగి, నుద్దండలీల నొక్కొక్కమాటు
   భాషింతు నన్నయభట్టుమార్గంబున, నుభయవాచాప్రౌఢి నొక్కమాటు
   వాక్రుత్తు తిక్కయజ్వప్రకారము రసా,భ్యుచితబంధముల నొక్కొక్కమాటు
   పరిఢవింతు ప్రబంధపరమేశ్వరునిఠేవ, సూక్తివైచిత్రి నొక్కొక్కమాటు

తే. నైషధాదిమహాప్రబంధములు పెక్కు, చెప్పినాఁడవు మాకు నాశ్రితుఁడు వనఘ
   యిపుడు చెప్పఁదొడంగినయీప్రబంధ, మంకితము సేయు వీరభద్రయ్యపేర.

ఇట్లని శ్రీనాథునిచే భీమకవి ప్రథమకవిగా వర్ణింపఁబడియెను.

దీనినే స్థిరపఱుచుచు నొక్కపద్యము గాన్పించును. అది నన్నయ భీమకవిని నుతియించి చెప్పిన దని యిదివఱకు వ్రాసియున్నారము. అదెట్లన్నను :-