పుట:Kavijeevithamulu.pdf/31

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
19
వేములవాడ భీమకవి

"శంభువరప్రసాదకవిజాలవరేణ్యుఁడ నైన"

అనుపద్యమును భీమకవి చెప్పి యతనిని మెప్పించి యతని యాస్థానకవిగా నట నుండుటకుఁ గోరఁబడియం దున్నట్లును జెప్పుకొనియెదరు. దీనింబట్టి చూడఁగాఁ జొక్కనృపాలుఁ డనియు శృంఖళుఁ డనియు నామములు గలరాజకళింగగంగునకీతఁడు సమకాలీనుఁ డని స్పష్ట మగుచున్నది. పైసీసపద్యములో భీమకవి తనకు సమకాలీనులుగా నైనను బూర్వులుగ నైనను నున్నవారల నామములు మనకుఁ గొన్ని కొన్ని తెలిపెను. వీరిలో బడబానలభట్టు చాలఁ బ్రసిద్ధిఁ జెందినవాఁడు. అతనింగూర్చి కొంచెము విశేషించి ముచ్చటించుటకుఁ బూర్వము తక్కినమువ్వురును గోపముతోఁ జెప్పినపద్యములు వారివారికవిత్వశైలి చూపుటకును దత్తత్కాలీనుల నామంబులు సూచించుటకును నిట వివరించెదము.

మేధావిభట్టు తాను హఠాత్తుగా [1] సాళువ పెదతిమ్మరాజును సమీపించినపు డతనిపైఁ బద్యముఁ జెప్పుట కిష్టము గలిగి పద్యము వ్రాయుటకుఁ దాటాకు లేక తాటిచెట్టును విరిగి పడు మని చెప్పినట్లుగా నీక్రిందిపద్యమువలనం గాన్పించును. అదియెట్లన్న :-

క. సాళువపెదతిమ్మమహీ, పాలవరుఁడు వీఁడె వచ్చెఁ బద్యము వ్రాయన్
   గేలను లే దా కొకటియుఁ, దాళమ ముత్తునియ లగుచు ధరపైఁ బడుమా.

ప్రౌఢకవిమల్లన గుడి యన్న మరాజుకొఱకు నడిచి పోవునపుడు కొండపల్లిపడమటఁ దనరెండుమడమలలో బ్రహ్మదండిముండ్లు గ్రుచ్చుకొనఁగా నీక్రిందిపద్యముం జెప్పెను. ఎట్లన :-

క. గుడియన్న నృపతిఁ బొడఁగన, నడువంగాఁ గొండపల్లినగరిపడమటన్
   గుడియెడమమడమ గాఁడిన, చెడుముండులు బ్రహ్మదండిచెట్టున డుల్లున్.

బడబాసలభట్టు త్రిపురాంతకమునుండి శ్రీశైలమునకుఁ బోవు

  1. ఇతనివంశముంగూర్చియుఁ గాలనిర్ణయముం గూర్చియుఁ బిల్లలమఱ్ఱి వీరన్న చారిత్రములోఁ జూడఁదగును.