పుట:Kavijeevithamulu.pdf/306

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

300

కవి జీవితములు

ష్ఠ నిల్పె ననియు నంతకంటె నధికుఁ డై యుండె ననియుం జెప్పవలసియున్నది. అట్టియాధిక్యమునకుఁ గారణములు ముం దుచితస్థలంబున వ్రాయుదుము.

సూరన కాలవిమర్శనము.

దీనివిషయమై యిదివఱలో నీసూరకవి చారిత్రము వ్రాసిన దక్షిణామూర్తిపండితుఁడును, ఆంధ్రకవిచరిత్రము వ్రాసిన కందుకూరి వీరేశలింగముపంతులును విశేషముగఁ జర్చించి యుండిరి. అం దాయుభయులసిద్ధాంతములు వేర్వేఱుగ నిట వివరించి అనంతరము నాసిద్ధాంతముం దెల్పెదను.

దక్షిణామూర్తిపండితుఁడు వ్రాసినదానిలోఁ గళాపూర్ణోదయ కృతిపతి యగునంద్యాలకృష్ణరాయల కన్నయగు తిమ్మరాజు విజయనగరాధి పతి యగుసదాశివరాయనికాలమునందు నంద్యాల కధిపతియై యున్నట్లును అది శా. స. 1490 (A. D. 1490 + 77 = 1567) మనియు నొకచోటఁ జెప్పి అనంతరము వెంకటపతిరాయలు పెన్గొండయందు సింహాసనాసీనుఁ డై యుండఁగ నంద్యాలను పైకృష్ణరాయ లేలుచున్నట్లు నంద్యాలగ్రామచరిత్రమునందు వ్రాయఁబడి యుండె నని తెల్పి వెంకటపతిరాయల కాలము క్రీ. శ. 1585 - 77 = (1508 శా. స.) ప్రారంభమై క్రీ. శ 1614 - 77 = (1537 శా. స.) రమున ముగిసె నని చెప్పియుండె. ఇట్లు చెప్పి అనంతరము సూరకవి రాఘవపాండవీయము రచియించునప్పటికిఁ జిన్న వయస్సులో నుండె ననియు నాగ్రంథముం బట్టి చూడ సూరకవి చాలకాలమువఱకు జీవించియున్నట్లును అనఁగా శా. స. 1465 మొదలు శా. స. 1523 వఱకు నని సిద్ధాంతీకరించెను.

పైదానిలో మనయభిప్రాయము తెలుపవలసియున్నది. అందు వ్రాయఁబడినప్రకారము కరిమద్దుల గ్రామశాసనములోని తిమ్మరాజు కృష్ణమరాజు నన్న యే అగునేని కృష్ణమరాజుకాలము దానింబట్టి యూహింప ననుకూలముగనే యున్నది. అయినను ఇతరములైన