పుట:Kavijeevithamulu.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18

కవి జీవితములు



నామంబులు గలవు. ఈవంశస్థులలోఁ గొందఱు శాలివాహనశకమునకు నాఱేడుశతాబ్దములకుఁ బూర్వముననే కళింగదేశమునకు వచ్చి యచ్చట స్థిరపడినట్లుగా హిందూ సిలోన్ దేశములయొక్క ప్రాచీనశాసనాదికములంబట్టియు, గ్రీసురోముదేశములలోని ప్రాచీనగ్రంథములం బట్టియుఁ గాన్పించుచున్నది. ఇది కొంతకాలము విశేషాభివృద్ధిగా నున్నట్లును మఱికొంతకాలము దుర్బలముగా నున్నట్లును గాన్పించును. ఇదివఱకు మనము చూపించిన దృష్టాంతములంబట్టి యీవంశమువారికి మరల నధికారప్రాబల్యము శాలివాహన సం. 900 మొదలు కల్గినట్లుగాఁ గాన్పించును. అదిమొదలు చిరకాలము వీరు విశేషవృద్ధిలో నుండి తుదను గృష్ణరాయలకాలములో మఱల నపజయము నందినట్లు గాన్పించును. ఆవృత్తాంతము లన్నియు దేశచారిత్రములో నుచితస్థలములలోఁ గీల్కొల్పుదము. మనము ప్రస్తుతాంశమును మఱలఁ గైకొందముగాక. ఈభీమకవి శృంఖలుని సమకాలీనుఁడనుటకు సందియము లేదు. ఇతఁడు శృంఖళరాజు నొద్దకు వెళ్లినప్పు డారాజు భీమకవిమాహాత్మ్యము దెలియక నీవు కవివై యేమిచేయఁగలవు? నీపే రెవ్వ రని యడిగిన భీమకవి యాగ్రహముతో నీక్రిందిపద్యమును జెప్పె నని కలదు.

సీ. గడియలోపలఁ దాడి నడఁగి ముత్తునియఁగాఁ, దిట్టినమేధావిభట్టుకంటె
   రెండుగడియల బ్రహ్మదండిముం డ్లన్నియుఁ, దుళ్లఁ దిట్టినకవిమల్లుకంటె
   మూఁడుగడియలకుఁ దా మొససి యత్తినగండి, పగులఁ దిట్టినకవిభానుకంటె
   నఱజాములోపలఁ జెఱుపునీ ళ్లినుకంగఁ దిట్టినబడబాగ్ని భట్టుకంటె

తే. నుగ్రకోపి నేను నోపుదు శపియింపఁ, గ్రమ్మరింప శక్తి గలదు నాకు
   వట్టిమ్రానఁ జిగురుఁ బుట్టింప గిట్టింప, బిరుద వేములవాడభీమకవిని.

అని పల్క నారాజు దాని నంతయు ఛలోక్తిగా నెంచి తనసభామంటపమం దున్న స్తంభమును వృక్షముగాఁ జేయఁగలవా యని యడిగినట్లును దానిపైని భీమకవి.

"అనీతాభ్యుపదానుశృంఖలపదాభ్యాలంబిత స్తంభమా"

అనుపద్యము చెప్పినట్లును నటుపిమ్మట నా స్తంభము వృక్షమై యాతనికా లందుఁ జిక్కుకొన భీమకవిం బ్రార్థింపఁగా