పుట:Kavijeevithamulu.pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

284

కవి జీవితములు

తే. చిగురుకెమ్మోవిపగడంపుసిరులు మెఱయ, మాటలాడంగఁ గనుదోయి తేటలమర
    చెమట లూరంగ సింహాద్రిఁ జేరవచ్చె, భోగగుణధామ యాంథ్రనియోగిభామ."

ఇంక ననేకపద్యము లున్నవి. అద్దంకిపట్టణము రెండవరంగమైనందుల కుదాహరణము.

"సీ. తళ్కుతళ్కున కాంతి బెళ్కు కెంపులముంగ, ఱందమై కెమ్మోనియందుఁ గుల్క
      ధగధగద్ధగలచేఁ దనరారుబంగారు, గొలుసులింగపుకాయ కొమరుమిగుల
      నిగనిగన్నిగలచే నెఱసిచెల్వగుగబ్బి, మేనుమిన్నందుల మెలఁగుచుండ
      రాజహంసవిలాస రాజితం బగుయాన, మందు మట్టెలు రెండు సఁదడింప

గీ. సరసచూపుల విటులను గరఁగఁజూచి, పొందికై నట్టి మోమున భూతిరేఖ
    రాజకళలొప్ప నద్దంకిరాజవీథి, బొలిచె నొకకొమ్మ గాజులముద్దుగుమ్మ."

శ్రీరంగ మొకరంగస్థల మైనందులకు.

"గీ. చెమటచేఁ దిరునామంబు చెమ్మగిల్ల, హాళి డాచేత విడియంబు గీలుకొల్పి
     రంగపురిరాజవీథిఁ గానంగ నయ్యె, నాదుమది కోర్కె లూర వైష్ణవవధూటి."

ఈవీథినాటకములోనిపద్యములలోఁ గొన్ని వర్ణన లద్భుతంబుగను మఱికొన్ని వర్ణనాంశములో నొకలోపమును లేకున్నను నిప్పటికాలమువారికి నేహ్యములుగాను నుండును. ఆగ్రంథము కేవలము పండితులఁకుగా నుద్దేశింపఁబడకపోఁబట్టి యెట్లు సెప్పంబడినను పరిగణియింప నవసరములేదు. గుణగ్రహణపారీణులు దోషమును వదలి గుణమునే యవలంబించెదరుగదా.

రాజమహేంద్రవరపండితులంగూర్చి.

వీథినాటకములో నుదాహరింపఁబడిన పద్యములంగూర్చి నాకుం బోలినమట్టుకు వ్రాసియున్నాను. ఆగ్రంథము చివరనే శ్రీనాథునిపద్యము లని మఱికొన్ని చాటుధార లుదాహరింపఁబడియున్నవి. వానిలోని పద్యములే యిదివఱకును జారిత్రములోఁ గైకొనందగినవి. అట్టిపద్యములలో రాజమహేంద్రవరములోని పండితుల నిందించుచు నొకపద్యము వ్రాయంబడినది. దానికిఁ గారణము మాత్రము విస్పష్టముకాలేదు. శ్రీనాథుఁడు పరస్థలస్థుఁ డగుటంజేసి యతనిరాక రాజమహేంద్రవరములో వీరభద్రారెడ్డి సభలోనిపండితుల కయిష్టముగా నుండుట స్వభా