పుట:Kavijeevithamulu.pdf/287

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీనాథుఁడు.

281

పనిచేయుశాఖకు "అగసాల" లనియు, "కంసాలు" లనియు నామము గలదు. ఆశాఖలోని స్త్రీ లిందు వర్ణింపఁబడిరి.

15. బొందిలీ స్త్రీ. బుందేలు ఖండ మనునుత్తరహిందూస్థాన దేశములో నుండునొకదేశమునుండి వచ్చి యనేక సంవత్సరములక్రిందట నాంధ్రదేశములో స్థిరపడియున్న గౌడదేశపు బ్రహ్మ, క్షత్ర, శూద్రశాఖలవారు బొందిలీలుగా వ్యవహరింపఁబడుదురు. వారి స్త్రీ లిందు వర్ణింపఁబడిరి.

16. జంగముభామ. కన్నడదేశమునుండి చిరకాలముక్రిందట నాంధ్రదేశమునకు వచ్చినశూద్రశాఖలోనిలింగాయతుల గురుపీఠస్థులకు జంగము లని పేరు. అట్టి శాఖ స్త్రీ నిందువర్ణించె.

17. లింగబలిజెస్త్రీ, శూద్రులలోపలనే లౌకికవ్యాపారమును జేసికొనుచు లింగాయతులుగా నున్నశాఖలు లింగబలిజె లని పేరు. వారి స్త్రీ యిందు వివరింపం బడియెను. లింగాయతులు కానిబలిజెకులము వారిని గాజులబలిజెశాఖ యని చెప్పుదురు. వీరి కాంధ్రశూద్రులలో శ్రేష్ఠు లైన తెలగా లని వాడుక గలదు.

18. రెడ్డి స్త్రీ. పైశూద్రశాఖలోఁ గొందఱు రెడ్లని పిలువఁబడుదురు. శ్రీనాథకవి యీరెడ్డివంశస్థులగు వేమ, వీరభద్రరెడ్లకే కాశీఖండము కృతి యిచ్చెను, ఆరెడ్ల స్త్రీ లిందు వర్ణింపఁబడిరి.

19. సాతానిభామ. ఆంధ్రదేశములోని వైష్ణవమతస్తు లై లౌకికవ్యాపారమును వదలుకొని కేవలము మతబోధమును, వైష్ణవధర్మాచరణమును ప్రధానముగాఁ గలశాఖాకు సాతాను లని పేరు. అట్టిసాతానులస్త్రీ యిందు వర్ణింపఁబడియెను.

20. సాలెత. లింగాయతమతస్థులలోని జంగమశాఖను గురువులుగా నేర్పర్చికొని యున్న శూద్రశాఖకు, సాలె లని, దేండ్ర లని,కరిణి బత్తులని మొదలగునామము లున్నవి. వీరందఱును తంతుకారులు. వీరి స్త్రీ లిందు వర్ణింపఁబడిరి.