పుట:Kavijeevithamulu.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీనాథుఁడు.

273

"ఘనదైవతంబు ద్రాక్షారామభీమేశుఁ, డని కొల్చె బెండపూఁ డన్న మంత్రి"

దీనింబట్టి చూడఁగా నన్నమంత్రి ద్రాక్షారామ భీమేశ్వరభక్తుఁ డని ప్రసిద్ధి నందెను. ఈయన్న మంత్రి శ్రీనాథు నొకనాఁడు పిలువనంపించి యీక్రిందివిధంబునం బల్కె. ఎట్లన్నను :-

"సీ. వినుపించినాఁడవు వేమభూపాలున, కఖిలపురాణవిద్యాగమములు
      కల్పించినాఁడవు గాఢపాకం బైన, హర్ష నైషధకావ్య మాంధ్రభాష
      భాషించినాఁడవు బహుదేశబుధులతో, విద్యాపరీక్షణవేళలందు
      వెదచల్లినాఁడవు విశదకీర్తిస్ఫూర్తి, కర్పూరముల దిశాంగణములందు."

గీ. బాకనాటింటివాఁడవు బాంధవుఁడవు, కమలనాభునిమఁనుమడ వమలమతివి
    నాకుఁ గృతి సేయు మొకప్రబంధంబు నీవు, కలితగుణగణ్య శ్రీనాథకవివరేణ్య.

అన్న మంత్రి తన్నుం గోరఁగా శ్రీనాథుఁడు తా నీగ్రంథ మతనిపేరఁ గృతి యిచ్చె నని తేలుచున్నది. పైపద్యములో వేమభూపాలునకు నఖిలపురాణాదికములను శ్రీనాథుఁడు వినుపించిన ట్లున్నది. ఇందుఁ బాకనాటింటివాఁడ వనుదాని కర్థము పాకనాటి కాఁపురస్థుఁడ వని కాక పాక నాటినియోగిశాఖలోనివాఁడ వని యర్థము.

పైపద్యములోనే శ్రీనాథుఁడు పాకలనాటినియోగిగాఁ జెప్పంబడియెను. ఈ శాఖవారు తాము పాకలనాటిశ్రేష్ఠుల మని వక్కాణించెదరు. వీరికి నాఱువేలనియోగిశాఖవారికిని సంబంధములు తఱుచుగా లేవు. శ్రీనాథునివా రనునతని వంశీయులలోఁ గొందఱుగోదావరీమండలములోనిమొగిలితుఱ్ఱులోఁ గొంతకాలముక్రిందట నివసించిరి. వారీదేశమునకు వచ్చియున్న కాలములోఁ బాకలనాటివారు బొత్తుగా లేనిగోదావరీమండలములో స్వశాకవారితో సంబంధములు మాని యాఱువేలనియోగులతో సంబంధముల నడిపిరి. ఇటులనే పైరెండుశాఖలనియోగిబ్రాహ్మణులకు నేఁటివఱకు సంబంధ బాంధవ్యములు సకృత్తుగా జరుగుచుండును.

శ్రీనాథకవి వేమభూపాలునివంశావళి వర్ణించుట.

ఇందు శ్రీనాథుఁ డితరగ్రంథములలోవలెఁ దనకృతిపతివంశావళిని ప్రారంభింపక యతనికిఁ బ్రభుం డగువేమభూపాలుని వంశముంగూర్చి ప్రథమములో వ్రాసె. ఇట్టివ్రాఁత కుద్దేశము వేమభూపాలునిగూడ నొకకృతి నందునట్లుగా నుత్సహించుట యని యూహింపవలసి యున్న