పుట:Kavijeevithamulu.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

262

కవి జీవితములు



రించి వ్రాయఁబడుం గావున నిప్పటి కీతనికథ ముగించెదము. కాని శ్రీనాథునకు సార్వభౌమబిరుదు గల్గించినసంస్థాన మిది కా దనియును, అది యానెగొందెసంస్థానములో నున్నదనియును జెప్పందగి యున్నది.

శ్రీనాథునిప్రభుఁ డగువేమారెడ్డి యని యిదివఱలో వ్రాసియున్నాను. కాని వేమారెడ్డినాము లనేకు లుండుటంబట్టి యితనిప్రభుండగువేమన యెవ్వరో బోధకాకుండును. కొండవీటిదండకవిలెలోఁ గోమటివేమారెడ్డి యితనికిఁ బ్రభుం డని వ్రాయంబడి యున్నది. కాశీఖండముకృతిపతి యగువీరభద్రారెడ్డి కన్న యగు వేమారెడ్డికూడ నీతని ప్రభుం డయినట్లు కాశీఖండములోఁ గానుపించును. ఆవేమనకు రాచ వేమన యని పేరు గలదు. అతడు రాజమహేంద్రవరములో నున్నట్లు కాన్పించు. కోమటివేమన అనపోతరెడ్డికుమారుఁడు. ఇతనిది కొండవీడు. ఆ వివరముంగూర్చి విశేషము చర్చింపవలసి యున్నదిగావున నిపు డద్దానిం దెల్పుటకుఁ బూర్వము కొండవీటిదండకవిలెలో నున్న కొన్ని మాటల నీక్రింద వ్రాసెను.

కొండవీటిదండకవిలెలో నీశ్రీనాథునకుఁ గోమటివేమన్న వలన రెండుపాలెము లీయఁబడె ననియును, అం దొకదానికి సొలసపాలె మనియు, రెండవదానికిఁ బాలెమనియు నామ మున్నట్లును జెప్పఁబడియె. ఆరెండ్రుగ్రామములును దొంతి, అల్లాడరెడ్డికాలములో నల్లా రెడ్డికూఁతునకు నతనివలన సంక్రాంతిపండుగబహుమానముగా నీయఁబడిన వనియు నున్నది. అల్లారెడ్డికూఁతురుపేరు వేమాంబ. ఆమెకు నామాంతరము మైలమ్మ యని కలదు. అయిలమ్మ కాగ్రామము లిచ్చి పొలిమేర హద్దులు పెట్టించి యం దొకదానికయిలమ్మపేరిట నయిలవర మనియును, రెండవదానికి సంక్రాంతిపండుగకుఁగా నీయఁబడుటచేత సంక్రాంతి పాలె మనియు నామకరణములు చేసిరి. నాఁడు మొద లవి ప్రత్యేకగ్రామము లాయె నని యున్నది.