పుట:Kavijeevithamulu.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీనాథుఁడు.

259



మైనను నిటఁ జెప్పక తీఱదు గావున దాని నిట వివరించెదను. వేమారెడ్డికిని సింగమనీనికిం గలవైరముం దీర్చుకొనుట కనేకమార్గము లిర్వుర కున్నను సింగమనీఁడు దానిం దీర్చుటకొకపడిగెముం జేయించి దానికి వేమారెడ్డి యనునామ ముంచి, ఊచవలెను వేమారెడ్డిం దేరా" అని తన భృత్యునితోఁ జెప్పుచుఁబ్రతినిముసమందున వేమారెడ్డిపేరు స్మరియింపుచు నెన్నిపరియాయము లూచినను నీవేమారెడ్డికిఁ దృప్తి లేదనియును, వేమారెడ్డివాతను సభ్యులందఱును నుమిసినగాని యతని కడుపు నిండ దనియు నిట్టి వే కొన్ని కార్యంబులు చెప్పి వేమారెడ్డిం గేలి చేయుచుండెను. అది వేమారెడ్డి వినియును సర్వజ్ఞసింగమనిని దండించుటకుఁ దగిన శక్తి లేకుండుటకు మిక్కిలి ఖిన్నుండై శ్రీనాథుని సింగమనీనికడకుం బంపి యాతని మానుపింప యత్నించె. అట్లు గావున శ్రీనాథుఁడు సింగమనీనిమనస్సు ముందుగ రంజిల్లుపద్యములం జెప్పి తన యభీష్టంబు తెల్పు మని యడిగిన సింగమనీనితోఁ బైయనుచితకార్యము మానుటయే తన యభిష్టమనియె. ఆమాటకు సింగమనీఁడు రసికుఁడును బండితుఁడును గావునని తరమూర్ఖభూపతులవలెం గాక దానిని వెంటనే తీసి వేసి యిఁక నెప్పుడును నట్టి యక్రమంబు గావింప నని పల్కెనఁట. సర్వజ్ఞ బిరుదు నందినభూపతియే యిట్టిదుర్నీతిగ నడిచె నని చెప్పి యుండఁగా నిఁక భూపతులదుర్నీతుల నే మని చెప్పవచ్చును. ఇది దేశచారిత్రము గావున నెట్టివృత్తాంతముల నైనం జెప్పక తప్పదు. దేశస్థు లందఱును నిట్టివి భావిజనోపకారులు గావున వీనిఁ బ్రకటించుట కనుజ్ఞ నీ యంగోరఁబడుచున్నారు.

శ్రీనాథుఁడు తెలుఁగురాయని సంస్థానమునకుఁ బోవుట.

సబ్బినాపిరాష్ట్రములోని రామగిరిదుర్గమున కధీశ్వరుం డగు తెలుంగురాయఁ డనునొకప్రభుండు గలఁడు. అతనిం దర్శించుటకుఁగాను శ్రీనాథుఁ డొకసమయంబునఁ బోయి యొకపద్యంబున నాశీర్వదించె. ఆపద్య మెద్ది యనఁగా :-