పుట:Kavijeevithamulu.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీనాథుఁడు.

257



మతుల నిచ్చి మరల రాయలకడకుం బంపి వేసెనఁట. శ్రీనాథుఁడును వీరు మరల రాయలకడకు వచ్చినసంగతి తెలిసికొని తనమాట నెగ్గుటకు సంతసించి రాయలఁ దనకవిత్వంబున నలరింపంజేసి బహుమతుల నందికొని మరలఁ గొండవీటిలో నున్న తనప్రభునికడకు వచ్చి చేరెను.

శ్రీనాథుఁడు రావుసింగభూపాలునొద్దకుం బోవుట.

వేమభూపాలుఁడు తనకు రావుసింగభూపాలునితోఁ బని గల్గ శ్రీనాథుని అతనిసభకుఁ బంప నుద్యోగించెను. కాని ఆసింగభూపునకు నీ వేమభూపాలునకును విశేషముగ నంతస్తాపము లుండుటంబట్టియు సింగభూపాలునకు సర్వజ్ఞుం డనుప్రసిద్ధి యుండుటంబట్టియు నాతనియాస్థానమునకుం బోయినచోఁ దనకుఁ బరాజయము గల్గునేమొ యనుసంశయంబు శ్రీనాథునకుం గలిగెను. అట్టిసందేహము తనకుఁ గల్గి దానిం దెలియపఱుపక సభ్యులును సింగభూపుఁడును సంతసిల్లునట్లుగా సరస్వతీ ప్రార్థనామిషంబున శ్రీనాథుఁడు

"ఎటుల మెప్పించెదో నన్ను నింకమీఁద, రావుసింగన్నభూపాలు ధీవిశాలు !
  నిండుకొలువున నెలకొని యుండి యిపుడు, సరససద్గుణనికురంబ శారదాంబ"

అని తనపూర్వదిగ్విజయప్రకటనమును, సింగభూపునివిద్యావైదుష్యముం బొగడి చెప్పెను. దానికి వా రందఱును సంతసించిరి. అంతట శ్రీనాథుఁడు సింగభూపు నీక్రిందివిధంబున నుతియించె. ఎట్లన్నను :-

"క. సర్వజ్ఞనామధేయము, శర్వునకే రావుసింగజనపాలునకే
     యుర్విం జెల్లును నితరుని, సర్వజ్ఞుం డనుట కుక్క సామజ మనుటే."

అనుపద్యము వినియును సింగభూపాలుఁడు శ్రీనాథుఁ డని తెలిసికొని విశేషముగ బహుమానింప కుండుట కలిగి యతఁడు సింగప్రభుని యర్థసింహాసనంబునఁ బోయి కూర్చుండె. దానికిం గనలి యంతట నచ్చటి సింగభూపసభా పండితులు శ్రీనాథున కీక్రిందిసమస్య యిచ్చిరి.

అది యెట్లన్నను :-

"కుక్కవొ, నక్కవో, పులివొ, కోఁతివొ, పిల్లివొ, భూతపిల్లివో"