పుట:Kavijeevithamulu.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీనాథుఁడు.

249

ఇఁక తిక్కనసోమయాజింగూర్చి చెప్పినపద్యము :-

ఉ. పంచమవేద మై పరఁగు భారతసంహిత నాంధ్రభాష గా
    వించెఁ బదేనుపర్వముల విశ్వజగద్ధితబుద్ధి నెవ్వఁ డ
    క్కాంచనగర్బతుల్యున కఖండితభక్తి నమస్కరింతు ని
    ర్వంచితకీర్తివైభవవిరాజికిఁ దిక్కనసోమయాజికిన్.

మఱియొకకవిం జేర్చి కాశీఖండములో నీపైముగ్గురు కవులను గృతిపతి తనకుఁగాను వర్ణించిన ట్లింకొకపద్యముం జెప్పెను. అం దధికముగాఁ జేర్పంబడినకవి వేములవాడభీమకవి. ఆపద్యమువలన నానల్గురు కవులపరిగణనలోనిముఖ్యతయును కవిత్వశయ్యాదులుంగూడఁ దెలియును గావున నాపద్యము నిట వివరించెదను. ఎట్లన్నను :-

"సీ. వచియింతు వేములవాడభీమనభంగి, నుద్దండలీల నొక్కొక్కమాటు
      భాషింతు నన్నయభట్టుమార్గంబున, నుభయవాక్ప్రౌడి నొక్కొక్కమాటు
      వాక్రుత్తు తిక్కయజ్వప్రకారము రసా, భ్యుచితబంథముల నొక్కొక్కమాటు
      పరిఢవింతు ప్రబంధపరమేశ్వరునిఠేవ, సూక్తివై చిత్రి నొక్కక్కమాటు."

అని యిట్లు కృతిపతివాక్యంబుగా నొకపద్యము చెప్పెను. అందే శ్రీనాథుఁడు కవిత్రయమును వర్ణించి మఱియొకవర్ణనముం జెప్పెను. దానింబట్టి చూడ నీశ్రీనాథుఁనకు భారతకవిత్రయమందే విశేషాదరమున్నట్లుమాత్రము కానుపించును ఆపద్య మెద్ది యనఁగా :-

"గీ. శబ్దశాసను నన్న పాచార్యవర్యు, సత్కవిశ్రేష్ఠుఁ దిక్క యజ్వను భజించి
      సత్ప్రబంధమహేశ్వరు శంభుదాసు, నధికతరభక్తిసంయుక్తి నాదరించి"

ఇట్లుగా శ్రీనాథుఁడు ప్రాచీనాంధ్రకవుల నుతియించి యాగ్రంథములోపలనే తనతాత యగుకమలనాభకవి నీక్రిందివిధంబున వర్ణించె నది యెట్లన్నను :-

"గీ. మత్పితామహుఁ డగుపితామహునిఁ దలఁచి, కలితకావ్యకళానాభుఁ గమలనాభు
     జంద్రచందనమందారసదృశకీర్తి, సరససాహిత్యసామ్రాజ్యచక్రవర్తి."

ఈకమలనాభునే శ్రీనాథుఁడు కాశీఖండమునకంటెఁ బూర్వరచిత మగుభీమఖండములోపలంగూడ నుతియించెను. ఎట్లన్నను :-