పుట:Kavijeevithamulu.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

248

కవి జీవితములు



ప్రారంభమందుఁ జదువుదురు. శ్రీనాథకావ్యత్రయ మాంధ్రసాహితికిం గలయవధిని బఠియించెదరు. సంస్కృతమునం గూడఁ బంచ కావ్యములు చదివినపిమ్మటనే నైషధముం జదువుదురు గావున నాంధ్రమునందును నీవఱలో జెప్పంబడిన మనుచరిత్రము, పారిజాతాపహరణమును, పాండురంగక్షేత్రమహాత్మ్యమును, భీమఖండమును, కాశీఖండమును జదివిన పిమ్మట నైన శ్రీనాధకృతశృంగారనైషధముం జదువవచ్చును. లేదా భీమఖండము లభియింపనిచోఁ గాశీఖండము చదివియే శృంగారనైషధముం జదువవచ్చును. లేదా ప్రారంభమునందే కాళిదాసకృతము లగు కావ్యత్రయము నభ్యసించినట్లుగా నీశ్రీనాథుని కావ్యత్రయముం జదివి పిమ్మటనే మనుచరిత్రమును, పారిజాతాపహరణ, పాండురంగక్షేత్రమాహాత్మ్యములను జదువవచ్చును. అది పాఠకులదార్ఢ్యముం బట్టియు నుపాధ్యాయుల ప్రాగల్భ్యముం బట్టియునుండును. కావున నాయుభయులు సమ్మతించినవానినే యవలంభింతురుగాక.

శ్రీనాథకృతకవిస్తుతి.

ఈ శ్రీనాథుఁడు తాను రచియించినగ్రంథములలో భారతకవిత్రయము నన్ని చోట్లును, తనతాత యగుకమలనాభుని, వేములవాడభీమకవిని, కొన్నిచోట్లను నుతియించెను. దానివలనఁ నతనికాలమునకుఁ బైకవులే ప్రసిద్ధు లై యున్నట్లుగా నెన్నందగియున్నారు.

ఆపద్యము లెవ్వి యనఁగా :- శృంగారనైషధములోనికవిత్రయసతి :-

"ధీరమతి నన్న పార్యునిఁ దిక్కయజ్వ, శంభుదాసునిఁ కర మర్థి సంస్మరింతు."

భీమఖండములో శ్రీనాథుఁడు ప్రత్యేకముగాఁ జేసిననన్న యభట్టు వర్ణన మెట్లన్నను :-

శ. నెట్టికొని కొలుతు నన్నయ, భట్టోపాధ్యాయసార్వభౌముని గవితా
    పట్టాభిషిక్తు భారత, ఘట్టోల్లంఘనపటిష్ఠ గాఢప్రతిభున్.