పుట:Kavijeevithamulu.pdf/238

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

224

కవి జీవితములుచల్లనగు. అని దీనాసనుండై ప్రసనుం డై యున్న రామరాజభూషణుం గాంచి సదయుండై రామకృష్ణుం డిట్లనియె. ఓయీ! వగవకుము ఎవ్వఁడో నీవిరోధి నీ కిట్టి విఘ్నం బొనరించె. అయిన నేమాయె. నేను రాజు కడ కరిగి నిన్నుఁగూర్చియు నీగ్రంథంబుఁగూర్చియు నాతనికి నెక్కుడుగఁ దెల్పి కార్యం బనుకూల మవున ట్లొనరించెదను. ఇదె పోయి వచ్చెద నని యప్పుడ ప్రభువు కడ కరుదెంచి యాతనితో నిట్లనియె. దేవరకు రామణూషణుండు నాఁడు కృతి నొసఁగ రా నాతని దురదృష్టంబున దానికి నంతరాయంబు సంప్రాప్తంబయ్యె. నాటంగోలె యాతం డన్న పానంబులు మాని దుఃఖంబునఁ గృశించుచున్నాఁడు. దేవర దాని నొకపరి విన్నంతమాత్రంబున నాతఁడు సంతుష్టాంతరంగుం డగును. కావున నాతనిఁ గరుణింపఁదగును. అనుడు రాజును గొంతదడవు చింతించి యోయీ! మున్ను కృతి నందక తిరస్కరించి మరల నాగ్రంథంబు విన మన మెట్లుత్సహించును. అనిన రామకృష్ణుఁ డిట్లనియె. సందియంబు దేవరడెందంబునఁ గ్రందుకొని యున్న దేని యొకయుపాయంబు సేయుదము. గతించినవారికేరికైన నీకృతి నిచ్చి యనంతరము దాని నిటఁ దెచ్చు న ట్లొనరింతము. ఇతరులు కృతిపతులైన గ్రంథంబు మనము వినుటకు శంక యుండదు. దోషంబులు గ్రంథంబున నుండు నేని తద్దోషంబులు కృతిపతిని బాధించుఁగాని శ్రోతలకేమి? కృతిపతి గతించి యుండుటచే నాతని నైన బాధించు ననుభయంబు లేదు. అనుడు రాజును దానికి సమ్మతించె. అప్పుడు రామకృష్ణుఁడు భట్టుకడ కేతెంచి యీ వృత్తాంత మంతయుఁ దెల్పి కృత్యాదిని నాశ్వా సాద్యంతములు మార్చి వైళంబ తెమ్మనుడు నాతఁ డట్లొనరించెను. అనంతరము రాజున కీవృత్తాంతంబు రామకృష్ణుఁడు దెల్పిన నాతఁడు సంతసంబున దాని వినుటకు సెలవొసంగెను. పిమ్మట రామరాజభూషణుఁడు వసుచరిత్రము నామూలాగ్రంబుగఁ జదివెను. దాని సావధానముగ విని రా జాతనిప్రజ్ఞా విశేషంబుల కెంతయు నలరి యిట్టిరామభూషణకృతికిఁ దాఁ గృతిపతి గాకుండ