పుట:Kavijeevithamulu.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెనాలి రామకృష్ణకవి.

223



నుప్పరులమధ్యంబు వెలువడి యొకముదుసలి యుప్పరి తనచే నున్నతట్టయుఁ బారయుఁ బాఱవైచి "సాయరా లచ్చి" యని కేక వేసి గుండెలు మోఁదికొనుచు రాజసన్నిధి కేతెంచి "సామీ ! యేలిక మేలు గోరి యీకవి కవితంబు సెప్పఁడు. నేఁటితోన ప్రభునకుఁ బ్రజకు ఋణంబు సెల్లె. ఇఁక నేమి సెప్పుదు" ననుడు రాజు "కారణంబే"మని యడిగె. అపుడు ముదుసలియుప్పరి రాజుం జూచి "యయ్యా! కొంత బూది తెప్పించిన నున్నరూ పెఱిగించెద" అనుడు రాజు నట్లు గావించె. ఆభూతి గొని యుప్పరి తనయఱచేత నొకబరి సేసి శ్రీ యనునక్కర మందు వ్రాసి భూ అని చేతికడ నోరుంచి పల్కె. దానిచే భూతియం దున్న శ్రీ రూపుమాసె. దాని రాజునకుం జూపి యిట్లనియె. "ఏలికసంపద నెల్ల నీభ ట్టిట్టిచెట్ట వెట్టి తొలఁగించె చూచితిరే! భూతిలోనిశ్రీ దొలంగె. ఇట్టికబ్బ మందుట కర్జంబు గా దని నాకుఁ బోలినట్లువక్కాణించితిని. ఇఁక దేవరచిత్తంబు అని యాయుప్పరి యచ్చోటు వాసి చనియె. రాజును నేమియు ననఁజాలక మఱియొకదినంబున నీగ్రంథంబు చూచెదమని యాస్థానంబు చాలించి యథెచ్ఛం జనియెను.

వసుచరిత్రమును పిండములపయి ధారపోయించుట.

అనంతరము రామరాజభూషణుండు విచారసాగరనిమగ్నుండై పుస్తకంబు హ స్తంబున నిడికొని యిల్లు సేరి విఘ్నకారుం డగునాముదుసలియుప్పరి యెవ్వం డగు నని యూహించి రామకృష్ణుం డగునని నిశ్చయించి స్వయంకృతాపరాధంబునకు వగచి యుపాయాంతరంబు లేమిం జేసి యాతనిపదంబు లాశ్రయించి కార్యంబు పొందుపఱిచికొందు గాక యని నిశ్చయించుకొని యాతనికడ కేఁగి చేతులు పట్టి నాయజ్ఞానంబు సైఁపు మని యిట్లనియె. అన్నా ! నే నిన్న వమానింపఁదలచి కావలసినట్టు లవమానంబు బొందితి. ఇపుడు నాకు జ్ఞానంబు వచ్చెను. ఇఁక నాయందుఁ గరుణించి నాకృతి రాజునకు శ్రుతిగోచర మవునట్లొనరించిన నీకు బహుపుణ్య ముండును. అంతటితోన నాయుల్లంబు