పుట:Kavijeevithamulu.pdf/232

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
218
కవి జీవితములుమొగమ్మునఁ గ్రమ్మఁ దల వాంచి కాల నేల వ్రాయుచు నూరకుండెను. అంతట రాజు నాయిర్వురం జూచి కార్యము మించుటకుఁ జింతించి యూరకుండుట తగనిపని యని యెంచి లేచి వారికరంబులు నిజకరంబులఁ బట్టి వజ్రం బెన్నండైన వజ్రంబునకుఁ దక్కువ యగునే. మీరిరువురు సమానులే యగుదురు. అని యాయిర్వురకుఁ కాంచనాంబరాభరణంబులు చీనిచీనాంబరంబులు నిచ్చి విశేషధనము నొసంగి యాపండితులకు సెలవొసంగెను. అపుడు కపటక్రియానిపుణుం డగురామకృష్ణుఁడు రాజుం జూచి, "స్వామీ! పండితమాని యగునీతని కీపండిత గండ యనుపెండేరం బుండఁదగునా యనుశంక వొడముచున్నది. దేవరచిత్త"మనుఁడు నర్సన వేషధారిపల్కు లాలించి రానియభిప్రాయమును గ్రహించి త్వరతోఁ దనకాలియందియ నూడ్చి లక్షఘంటకవి కిచ్చి రాజుకడఁ బనివిని వీథిం దిట్టుచు వచ్చినత్రోవం జనెను. రాజును లక్షఘంటకవికి సెల వొసంగి నిజావాసమునకుం జనియె. సభ్యులు లక్షఘంటకవిప్రజ్ఞావిశేషంబులఁ దలంచుచు యథేచ్ఛం జనిరి.

రామకృష్ణుఁడు భట్టుమూర్తివలన ముత్యాలహారముం గైకొనుట.

ఒకానొకదినంబున భట్టుమూర్తి కృష్ణరాయల నీక్రిందిపద్యము సెప్పి నుతించె నదెట్లన్నను :-

క. నరసింహకృష్ణరాయని, కర మరు దగుకీర్తి యొప్పెఁ గరిభిద్గిరిభిత్
    కరికరిభిద్గిరిగిరిభిత్, కరిభిద్గిరిభిత్తురంగకమనీయం బై.

దీని విని రాయఁడు మిగుల సంతసించి తనమెడ వ్రేలుచున్న తార హారం నాభట్టుమూర్తి మెడఁ గీల్కొల్పెను. దాని ధరియించి భట్టుమూర్తి పండితసభలోఁ దారామధ్యస్థితుం డగుచంద్రుని భంగిఁ బ్రకాశింపఁ దొడంగె. ఇట్టిగౌరవం బీతనికిం గల్గుటంజేసి సభ్యు లేరును సమ్మతింపరైరి. కావున నిందలిముఖ్యపండితులు కొందఱు సభ చాలించినయనంతరము రామకృష్ణునియింటికి వచ్చి యాతనిరాకకు వేచియుండిరి. అతఁడును గొంతరాత్రి కింటికిం జనుదెంచె. అపు డీపండితులు సకరుణం