పుట:Kavijeevithamulu.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

216

కవి జీవితములు



డను కినియకుఁడీ" అని యాతని బుజ్జగించి, స్వామీ! నా కొకటిరెండు సంశయము లున్నవి. ఆసందియములఁ దొలంగించి నామనస్సును నిష్కళంకముగఁ జేయుఁ డనుడు నర్సన "అబ్బా ! నే నంతవాఁడనే? అయిన నాయెడం గరుణించి యాప్రశ్నము లానతిచ్చిన విని కొంత తని సెదను." అనుడు రామకృష్ణుం డిట్లనియె. పండితవర్యా! నా కీవఱకు నుక్త లేఖనంబునఁ బ్రజ్ఞావంతుండును, దప్పులు దిద్దుటయందు నేర్పరియు నగు పండితుండును, కవియుఁ గాన్పించఁడయ్యె. మీర లేమైన వీనిని నేర్చి యుంటిరే? అనుడు నర్సన గర్వించి యిస్సిరో! యీతం డిట్టిప్రశ్నము లా నన్నడుగుట ఈతనిచేవ తెలిసినది. అని నిశ్చయించుకొని పండితోత్తమా! మేలుమేలు! గొప్పసంశయము లడిగితిరి. కవికి ముఖ్యముగా వలయినీరెంటిని నేర్చి యుండకున్న నేపండితుండును గవి యగు టెట్లు గల్గు? నాశిష్యు లందఱును మొదట నాకడ నీరెంటినే యభ్యసింతురు. వలయునేని నాశిష్యుం డొక్కరుండు మీకు నుత్తరం బిచ్చి మిమ్ముే దృప్తి నొందించును. ఇట్టిప్రశ్నము వేదమా? శాస్త్రమా! నేను యోజించుటకు? అని నర్సన లక్షఘంటకవి యనుభయ మింతయైన లేక యహంకారమునఁ బల్కినఁ గనలి రామకృష్ణుండు స్వామీ! మీశిష్యులకుం గఱపినతెఱఁ గెఱిగింపుఁడు. చూడ వేఁడుక గల్గుచున్నది. నానుడుపుపద్యం బిపుడు వ్రాసి నన్ను గారవింపుఁడు. అని తనచేతియాకును ఘంటము నందిచ్చి :-

క. త్ప్రవ్వఁట బాబా, తలపై పు వ్వఁట జాబిల్లి, వల్వ బూ చఁట, చేఁ దుం
   బు వ్వఁట, చూడగ నుళుకు క్కవ్వఁట, యరయంగ నట్టిహరునకు జేజే.

అని చదివి వ్రాయుము వ్రాయు మని వేగిరింపుడు, నర్సన మొదటియక్కరము నుచ్చారణానుసారముగ వ్రాయఁ జేయాడక క్రిందు మీఁదు చూచుచు నొకపరి వ్రాసినయక్షరము మరలఁ దుడువు పెట్టుచు నింకొకవిధముగ లిఖించి దానిం జెఱిపి వేయుచు నీతీరున నదియే వ్రాయుచునుండె. అపుడు రామకృష్ణుం డాతనిం జూచి చాలు! చాలు!