పుట:Kavijeevithamulu.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెనాలి రామకృష్ణకవి.

213



సూర్యోదయం బగుడు నెప్పటియట్ల కాల్యకృత్యములు దీర్చుకొని ధూర్జటి యొంటిప్రాణంబుతో నాస్థానంబునకుం జనుదెంచెను. అంతకుమున్నె రామకృష్ణుండు వచ్చి యొకచోఁ గూర్చుండి యుండెను. విభూతియు రుద్రాక్షలు మెఱయఁ గేవలము ధూర్జటివడువున వచ్చెడిధూర్జటిం గని రాయఁడు మిక్కిలి సంతసంబున : -

"చ. స్తుతమతి యైనయాంధ్రకవిధూర్జటిపల్కుల కేల కల్గె నీ
     యతులితమాధురీమహిమ?

అనుడు రామకృష్ణుండు లేచి : -

"హా తెలిసెన్ భువనైక మోహనో
 ద్ధతసుకుమార వారవని తాజన తాఘన తాపహారిసం
 తతమధురాధరోదితసుధారసధారలఁ గ్రోలుటం జుమీ."

అనుడు రాజును సభ్యులు రామలింగము పల్కులకు నెంతయు నవ్విరి. ధూర్జటియుఁ దలవంచుకొనియెను.

రామకృష్ణుఁడు సహస్రఘంటకవి నోడించుట..

ఒకానొకదినమున రాజదర్శనార్థమై సహస్రఘంటకవి యగుప్రెగడ రాజు సర్సన యనునాతఁడు వచ్చి సముచితంబుగఁ దనరాక నెఱిగించి పుచ్చె. సహస్రఘంటకవి రాక విని రాజు మిగులఁ జింతించి పండితుల రావించి యిట్లనియె. "ఓసభ్యులారా ! సహస్రఘంటకవి వాదార్థియై వచ్చియున్నాఁడు. ఇచ్చో నాతని కీడగువా రున్నట్లు గానరాదు. కర్తవ్యం బెద్ది? మనసభకుఁ బండితసభ యనుమాట నేఁటితో ముగియ నున్నది. దీనికి మీ రేమిచేయ నున్నా రనుడుఁ బండితు లుల్కి మొగంబులు వెల్వెలఁబాఱ, బయలు సూచుచు డోలాయమానమానసులై యొకరి నొకరు వీక్షించుచు గుసగుసలాడ నారంభించిరి. ఇట్లు కొంత సే పుండి వారందరుఁ బెద్దనను దలంచికొని "పెద్దన మనకుం బెద్ద. కావున మనల నుద్ధరింప నతఁడె సమర్థుం" డని యాతని నుపాయము సెప్పు మనిరి. అతఁడును నించుక చితించి వికసన్ముఖుఁడై ప్రభునిం జూసి యిట్లనియె. "స్వామీ ! యిట్టితంత్రం బెచ్చో నైనఁ గాంచితిరే.