పుట:Kavijeevithamulu.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెనాలి రామకృష్ణకవి.

211



నాతనికి విశేషసమ్మానము గావించి యీతఁడు మనకు లభించుట మన భాగ్యముసుఁడీ. ఈతని నష్టదిగ్గజములకు వలయువారిలో నొక్కనిగ నియమించితిమి. దానికి మీరు సమ్మతింపవలయు ననుడు సభ్యులు విశేషానందంబున సమ్మతించిరి.

రామకృష్ణుఁడు వరాలపళ్లెరము నందుట.

ఇట్లు ప్రభుసన్మానమును గాంచి రామకృష్ణుఁడు నిజచిత్రవ్యాపారముల సకలజనవినోదములు గావించుచుండెను. ఇట్లుండఁగా నొకానొకదినమునఁ గృష్ణరాయఁడు వరా లుంచి యొక పళ్లెరము దెచ్చి నిర్దోషముగాఁ బద్యము సెప్పి దీని నందికొనుఁ డని పండితుల కాజ్ఞ యొసంగెను. అపుడు పెద్దన లేచి నేనే పద్యము సె ప్పెదనని యీక్రిందిపద్యము సెప్పెను.

మ. శరసంధానబలక్షమాదివివిధైశ్వర్యంబులం గల్గి దు
     ర్భరషండత్వబిలప్రవేశ చలనబ్రహ్మఘ్నత ల్మానినన్
     నరసింహక్షితిమండలేశ్వరుల నెన్న వ్వచ్చు నీసాటిగా
     నరసింహక్షితిమండలేశ్వరునికృష్ణా రాజకంఠీరవా.


అని తనయాశుకవిత్వనైపుణిం జూపినపెద్దనకవిం జూచి నవ్వి రామకృష్ణుఁడు తాతా ! బిలముఁ జొచ్చినను రాజకంఠీరవా ! రమ్మని తోఁకబట్టుకొని వెలి కీడ్చుచున్నావు. ఇది దోషమే కదా! మఱి నేను వచించెదఁ జూడు మని యీక్రిందిపద్యము నుడివెను.

"మ. కలనం దావకఖడ్గఖండితరిపుక్ష్మాభర్త మార్తాండమం
       డలభేదం బొనరించి యేఁగునెడఁ దన్మధ్యంబునన్ హారకుం
       డలకేయూరకిరీటభూషితుని శ్రీనారాయణుం గాంచి లోఁ
       గలఁగంబాఱుచు నేఁగె నీవ యనుశంకం గృష్ణ రాయాధిపా."

అనుపద్యము విని మెచ్చి పెద్దనయు సభ్యులును నీతని కీపారితోషికం బీయఁదగు ననిరి. రాజును సంతసమునఁ దదనుసారముగ నద్దాని నాతని కొసంగెను.