పుట:Kavijeevithamulu.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెనాలి రామకృష్ణకవి.

209



గోచరము లగును. మార్గాయానమున నున్నాఁడను కావున నే నిప్పటికిఁ బనివినియెదను" అని నిజావాసమునకుం జనియెను. ధరణీధవుఁడును సంతుష్టాంతరంగుఁ డై రామకృష్ణుని దలంచుచుఁ గొలువు సాలించి నిజా వాసమునకుం జనియెను.

రామకృష్ణుఁడు పండితుఁడుగా రాజుం దర్శించుట.

మఱునా డా రాజదేవేంద్రుఁడు నిజసభాభవనంబునఁ గవిబుధ నికరపరివేష్టితుఁ డై గురునితో సంభాషించుచుఁ గొలువుండి విద్యా గోష్ఠి సలుపుచుండెను. అత్తఱిఁ దలవాకిటఁ గట్టఁబడియున్న నూతన పండితజనవిద్యాప్రకాశకఘంటానాదము వీనులకు విన వచ్చినది. అపుడు పుడమిఱేఁడు విబుధదర్శనోత్సుకుఁ డై ఘంటానాదముతోడ నిజమోదము రెట్టింప దాని మరలమరల వినుచుండె. అపు డది మఱియొకపరి మొఱసినది. దాని విని పండితుఁడు రెండువిద్యల నేర్పరి యగు నని యేర్పరించుసమయమున నాధ్వని మరలమరలఁ గర్ణగోచరము గాఁ దొడఁగినది. దాని విని సభ్యులందఱును నత్యాశ్చర్యమున నుండిరి. అపుడు రాజోత్తముఁ డాపండితు నంతటితో ముగించి రమ్మని తెల్పుట కొక భటునిం బనిచె. వాఁడు రాజాజ్ఞానుసారముగ వచ్చి వృత్తాంతమును దెలిపెను. రామకృష్ణుఁడు దౌ వారికపురస్కృతుఁడై వచ్చి రాజుకట్టెదుట నిలువంబడియె. రాజు నాతనిం జూచి వెఱఁగంది "నీ నేర్చువిద్య లెన్నిగల వనుడు నాతఁడిట్లనియె. "స్వామి ! నానేర్చువిద్యల నెన్న నేండ్లు పట్టును సులభమార్గమునఁ దెల్పెద నాకర్ణింపుఁడు విద్యకు నొక్క వ్రేటైన నీగంట బీఁటవాయు. దేవరసన్నిధానమునకుఁ బరిక్షార్థినై వచ్చియున్నాఁడను. కావున నాయభీష్టము దీర్చి నను నాస్థానకవిగాఁ గైకొన వేడెదను. అను పల్కులకు సభ్యులందఱును భయమందిరి.

రామకృష్ణుఁడు జ్యోతిషములోఁ బరీక్ష నిచ్చుట.

అపుడు రాజు సభాసదులఁ జూచి యీమహావిద్వాంసునిఁ బరీక్షించుటకుఁ దగుశాస్త్రమును దగుపండితుని నెఱిఁగింపుఁ డని యాజ్ఞ