పుట:Kavijeevithamulu.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10

కవి జీవితములు



సవరించుకొనుటకు నిలిచినపుడు భీమనకుఁ గొన్నిమాటలు వినవచ్చినవి. అటుక్రితము ఎదురుగ వచ్చుచున్న రాజకళింగగంగు భీమకవికడ నున్నదివిటీలఁ జూచుచు నడుచుచుండెను గావునఁ ద్రోవ నున్న యొకగోతిం జూడఁజాలక యందుఁ గూలి పై కెగఁబ్రాఁకుచు ఛీ ! కాలిదివిటీయైనను లేనివానిబ్రతుకు నిరర్థముగదా యనుచుండెను. ఈవృత్తాంతము భీమనచెవులం బడినతోడనే అతఁడు కొంచెము చింతించి "యెవడు రా యాగోతిలో నున్న వాఁడు" అనుఁడు రాజకళింగగంగు "అయ్యా! నేను వేములవాడభీమకవిగారిచేఁ జేయఁబడినజోగి" ననియెను. ఆమాటవిని భీమన "నీవు రాజకళింగగంగువా" యనుఁడు చిత్తమురక్షింపుఁ డని పాదంబులపైఁ బడి మ్రొక్కందొడంగెను. అట్టి కళింగగంగుం జూచి యాతఁ డిట్లనియెను :-

చ. బిసరుహగర్భువ్రాఁతయును విష్ణునిచక్రము వజ్రివజ్రమున్
    దెసలను రాముబాణము యుధిష్ఠిరుకోపము మౌనిశాపమున్
    విసకపుఁబాముకాటును గుమారునిశక్తియుఁ గాలుదండమున్
    బశుపతికంటిమంటయును బండితవాక్యము రిత్త వోవునే.

అనుపల్కుల కుల్కి రాజకళింగగంగు క్షమింపుఁడు క్షమింపుఁ డని నమస్కరించిన భీమన మరల నిట్లనియెను:-

ఉ. రామునమోఘబాణమును రాజశిఖామణికంటిమంటయున్
    దామరచూలివ్రాఁతయును దారకవిద్విషు ఘోరశక్తియున్
    భీముగదావిజృంభణము వెన్నునిచక్రము వజ్రివజ్రమున్
    వేములవాడభీమకవిభీషణవాక్యము రిత్త వోవునే

ఇదియే భీమనచెప్పినపద్యము కావచ్చును. పైపద్యము దీనికిఁ బాఠాంతర మని తోఁచెడిని. ఇట్లని నవ్వుచు నారాజుం జూచి భీమకవి యిట్లనియె

ఉ. వేయుగజంబు లుండఁ బదివేలుతురంగము లుండ నాజిలో
    రాయలఁ గెల్చి సజ్జనగరంబునఁ బట్టముఁ గట్టుకో వడిన్
    రాయకళింగగంగు కవిరాజభయంకరమూర్తి చూడఁ దాఁ
    బోయెను మీనమాసమునఁ బున్నమ వోయినషష్ఠి నాఁటికిన్.