పుట:Kavijeevithamulu.pdf/217

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
203
తెనాలి రామకృష్ణకవి.కావున మదీయమాయోపాయములు చూపి వీనిమానము దొలఁగించి నాకోపము గొంత పాపికొనెదను. అని యిట్లు నిశ్చయించుకొని యిలు వెడలి యాచార్యుం డొకవిజనప్రదేశమునఁ గాలోచితకృత్యములు నిర్వర్తింపఁ గని యాతని బహుభంగుల వేసరింపఁ దొడంగెను. దానికి వెఱచి యాచార్యుఁడు సామమునఁ గార్యము చక్కఁ జేయ నిశ్చయించి ఓయీ! నీపుణ్యము గాని నన్నిఁకఁ జిక్కులం బెట్టక నీయిష్టానుసార మయిన కార్యము నాచేఁ గొను మనియె. అనుడు రామకృష్ణుఁడు తాతా! నన్ను నీమూఁపున నిడికొని మాయింట నిలిపి ర మ్మని యాజ్ఞ యొసంగెను. అపు డాచార్యుఁడు విన్నఁబోయి దైవమా యేమి సేయుదు నని యిట్లు చింతించెను. వృద్ధుఁడను నేను వీని నెట్లు భరింతును? అటు గాకున్న వీఁ డింకను నన్ను బన్నములపాలు సేయ నున్నాఁడు. పోనీమ్ము. వానియిష్టమే చెల్లింత మనుచు, నింకను గనువెల్గున్న యది, చీఁకటి రాఁ గని న న్నితఁ డింకను నెన్నిపాట్లుపెట్టునో? శుభస్య శీఘ్రమ్మని యున్నది. కావున వేగిరింత మని యాతనిఁ దనమూఁపుపై నెక్కించుకొని యొకకొంతదవ్వు సాఁగినడిచెను. అంత నినుం డినగురున కగునవమానమున కేమియుఁ జేయఁజాలక ఖిన్నుఁడై దుఃఖాబ్ధిలో మునిఁగె ననఁ బశ్చిమ సముద్రములోఁ గ్రుంకెను. అపుడు రామకృష్ణవాహకద్విజేంద్రుఁడు పదయుగళము పదిలము సేసికొని పక్షద్వయము భద్రపఱిచి పురోపకంఠజలాశయతీరం బధిరోహించెను. అపు డచ్చోట నుండుజన మావిచిత్ర మైనవాహనము జూచి నిరృతియ కా నోపు నని సమీపించి సందర్శింపఁగాఁ బరస్పరాహ్వానములు చెలఁగఁ గుమిగూడి రాఁ దొడంగిరి. అపుడు రాజు సఖులు గొలువఁ బ్రాగ్దిశా సౌధంబునఁ బొడసూపి వికసితకమల నయనుండై తారకలు సెదరనీయక చూచుచుండెను.