పుట:Kavijeevithamulu.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

196

కవి జీవితములు



వైష్ణవమతప్రవిష్టుఁ డగుటకు గద్యములోని పరమపదసనాథశబ్దమే చాలియుండును. ఆగద్య మెట్లన్నను :-

"ఇది శ్రీమత్పరమపరమపద నాథ నిరవధిక కృపాపరిపాక పరిచిత సరస కవితాసనాథ రామకృష్ణకవినాధప్రణీతం బగుపాండురంగ మాహాత్మ్యము."

అని యున్నది. కృతిపతి యగువిదూరివేదాద్రిమంత్రి నీక్రింది విధంబున వర్ణించెను. అదియెట్లన్నను :-

సీ. తనకులాచారవర్తన వైష్ణవాచార, పర్యాయముల కోజబంతి గాఁగఁ
   దననూనృతము పురాతనసత్యవిధులయు, న్నతికిఁ బునఃప్రతిష్ఠితము గాఁగఁ
   దనబుద్ధి నీతిశాస్త్రరహస్యములు తెల్ల,ముగఁ దెల్పు నాఖ్యానముద్ర గాఁగఁ
   దనవ్రాయుగంటంపు మొనవాఁడి విశ్వంభ, రాప్రజలకుఁ బ్రాణరక్ష గాఁగఁ

గీ. వెలయ మంగయగురవభూవిభుని పెద్ద, సంగభూపాలమణిరాయసంప్రపత్తి
   జయయుతుం డైన రామానుజయ్యసుతుఁడు, భద్రగిరివిదూరివేదాద్రిశౌరి.

కృతిపతిప్రభుఁ డగుసంగభూపాలునిఁగూర్చి.

ఈరామకృష్ణకవి తనకృతిపతియాధిత్యమును దెల్పుటకుఁ గా నాతనిప్రభుం డగుపెద్దసంగభూపాలునివిశేషము లీక్రింద వివరించుచున్నాఁడు. కవికాలమును, కృతిపతికాలమును నిర్ణ యించుటకుఁగానప్పటి రాజులకాలవిజ్ఞాన మవసర మైనది కావున నాయంశముల నీక్రింద వివరించెదను. అవి యెవ్వి యనఁగా :-

"వెండియు నవ్వేదాద్రిమంత్రీశ్వరుండు రవికులతిలకుండును, నఖండితభాగ్యవర్ణ పూర్ణలలాటఫలకుండును, పూర్వసింహాసనాధీశ్వరుండును, సతతసమారాధిత నిర్మలసంగమేశ్వరుండును, రాయరాహుత్తుండును, లోకోత్తరగుణోత్తరుండును, రణరంగధీరుండును, అంబునిధిగంభీరుండును, భట్టారబాహాంకుండును, నకలంకుండును, నరవత్తారుమండలీకరగండండును, నుద్దండభుజాదండుండువై, పరనారీ సహోదరుండును, నితరనరవర సముపార్జితకీర్తివధూవల్ల భుండును, గోపికాగోవిందుండు నయ్యును నీశ్వరలక్షణలక్షితుండును, పొన్నాంబరదేవరదివ్యశ్రీపాదపద్మారాధకుం డయ్యును, ప్రతిష్ఠాపిత పరమవైష్ణవ కుటుంబవిశేషుండును, నయినఘనుని"

అనియును

"గీ. గుఱుతు గలరాజుమంగయ గురవరాజు, పుత్త్రు పెదసంగభూపాలుశత్రుజైత్రు
    భామసహాతేజు విద్యావిధానభోజుఁ, గొలిచి వేదాద్రినిత్యలక్ష్ములఁ దనర్చు".