పుట:Kavijeevithamulu.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నందితిమ్మన.

191



జెప్పంబడలేదు. కావున వరాహపురాణములోఁ జెప్పంబడినయీశ్వర రాజు మనుచరిత్రములోను, పారిజాతాపహరణములోను, జెప్పంబడిన తుళువవంశములోని యీశ్వరరాజు గాక సాళువవంశములోని యీశ్వరరాజుగాఁ జెప్పంబడుట సరియై యున్నట్లు కానుపించును. ఈసాళువవంశములోనివా రందఱును ప్రత్యేకముగా మండలాధిపతు లైనంగాక యంతకంటెను డక్కువస్థితి గలసామంతప్రభువులై యున్నట్లు కానుపించును. దానికి దృష్టాంతము జైమినిభారతములోని సాళ్వమంగరాజుం గూర్చి జెప్పెడియీక్రిందిపద్యము చాలియుండును. ఎట్లన్నను :-

"సీ. దురములో దక్షిణసురతాణి నెదిరించి, కొనివచ్చి సాంపరాయనికి నిచ్చె
    సామ్రాజ్యమున నిల్పి సాంపరాయస్థాప, నాచార్యబిరుదవిఖ్యాతి గాంచె
    శ్రీరంగవిభుఁ బ్రతిష్ఠించి యిర్వదివేల, మాడ లద్దేవునుమ్మడికి నొసఁగె
    మధురాసురత్రాణు మడియించి పరపక్షి, సాళువబిరుదంబు జగతి నెరపె

గీ. గబ్బితనమునఁ దేజి మొగంబు గట్టి, తఱిమి నగరంపుగవనులు విఱుగఁద్రోలి
   తాను వ్రేసినగౌడునుద్దవిడిఁ దెచ్చె, సాహసంబున నుప్పొంగు సాళ్వమంగు.

అను దీనిలో నుదాహరింపఁబడినసాంపరాయఁడు మండలాధిపతిఁ ఇతనికడను సాళ్వమంగు సేనానాయకుఁడై యుండి కొన్నియుద్ధములలో సాంపరాయనికిఁ దటస్థములైనచిక్కులఁ దొలఁగించి సాంపరాయ స్థాపనాచార్యబిరుదము నందెను. ఈసాళ్వమంగు జైమినిభారతకృతిపతి యగు నరసింహరాజునకుఁ బ్రపితామహుఁడు. కాఁబట్టి వీరివంశములో నుండువారు మండలాధీశ్వరులని గ్రంథదృష్టాంతము లగుపడువఱకును వీరు కృష్ణరాయవంశస్థులకుఁ బూర్వు లని చెప్ప వలనుపడదు; అది నిశ్చయమగువఱకును నావంశములోనివారి కాలనిర్ణయము నాసిద్ధాంతము పైని నిర్ణయింపఁ గూడదు. ఇంతియ కాక పైసాళ్వవంశమువారు కృష్ణదేవరాయనికాలమువఱకును సాళ్వవంశనామముతో నుండిరి. కృష్ణదేవరా యనికడ మన్నన గలమంత్రి యైనతిమ్మరుసు సాళ్వవంశమువాఁడై యున్నట్లు కృష్ణరాయవిజయములోని యీక్రిందపద్యమువలనఁ గాన్పించును. ఎట్లన్నను :-