పుట:Kavijeevithamulu.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

190

కవి జీవితములు

"క. ఉర్వీశమౌళి యగునా, దుర్వసువంశంబునందు దుష్టారిభుజా
    దుర్వారగర్వరేఖా, నిర్వాపకుఁ డీశ్వరాఖ్యనృపతి జనించెన్."

అని వ్రాసెనుగాని తరువాతిపద్యములో నీశ్వరరాజుంగూర్చి వ్రాయుచుఁ దిమ్మయయీశ్వరుం డని వ్రాయుటంజేసి యాయీశ్వర రాజుతండ్రి తిమ్మరా జని తేలును.

"ఉ. రాజులనెత్తుటం బరశురాముఁడు వ్రంతలు చేసె రెండు మూఁ
    డీజగతిన్ గణింప నది యెంతటివిస్మయ మబ్జినీసుహృ
    త్తేజుఁడు కందుకూరికడఁ దిమ్మయయీశ్వరుచే జనించె ఘో
    రాజి బెడందకోటయవనాశ్వికరక్త నదీసహస్రముల్.

పారిజాతాపహరణములోని యీశ్వరరాజువర్ణనము.

ఈశ్వరరాజు మనుచరిత్రములో నీక్రిందివిధముగ వర్ణింపఁబడియెను :-

"చ. బలసుదమత్తదుష్టపురభంజనుఁడై పరిపాలితార్యుఁడై
    యిలపయిఁ దొంటియీశ్వరుడె యీశ్వరుఁడై జనియింప రూపఱెన్
    జలరుహ నేత్రలం దొఱగిఁశైలవనంబుల భీతచిత్తు లై
    మెలఁగెడు శత్రుభూవరులమేనులు దాల్చినమన్మథాంకముల్."

ఇపుడు మనము పై నుదాహరించినయిర్వురు యీశ్వరరాజులకును జెప్పంబడినవిజయముల నరయఁగలము. అందు వరాహపురాణములోని యీశ్వరరాజు జయములు చెప్పుటలో

1. ఉదయాద్రి భేదించెను.
2. హుత్తరి నిర్జించెను.
3. గండికోటపురంబు త్రవ్వించెను.
4. పెనుగొండ సాధించెను.
5. బెగ్గులూరు హరించెను.
6. కోవెల, నెల్లూరు గుంటుపఱిచెను.
7. కుందాని విదళించెను.
8. గొడుగుచింత జయించెను.
9. బాగూరు, పంచముపాడు చేసెను.
10. నరుగొండ పెకళించెను.
11. నామూరును గొట్టెను.
12. శ్రీరంగపురమును సమరెను.

అని యున్నది. పారిజాతాపహరణాదులలోని యీశ్వరరాజు కందుకూరికడ గొప్పయుద్ధము చేసి యక్కడ బెడఁదకోట తురుష్కుల యొక్కగుఱ్ఱపుదళములను రక్తప్రవాహము లగునట్లుగాఁ గొట్టె నని మాత్ర మున్నది. ఆమాత్రపువృత్తాంతమైనను మనుచరిత్రములోను