పుట:Kavijeevithamulu.pdf/203

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
189
నందితిమ్మన.

కృష్ణరాయనివంశములోఁ జెప్పంబడినయీశ్వరరాజునకు నీపై యీశ్వరరాజునకును భేద మేమైన నున్నదో లేక యీయిర్వురును నొక్కరుగా నెన్న వలయునో దానిం దెలియవలసి యున్నది. పారిజాతాపహరణములోపల, మనుచరిత్రంబులోపల నొకయీశ్వరరాజు వర్ణనము గలదు. దాని నిచ్చో వివరించి పిమ్మటఁ బైనంప్రశ్న మాలోచింతము. అందు మనుచరిత్రములోపలఁ గనుపించిన వంశావళియే యాముక్తమాల్యదలోఁగూడ గానుపించుం గావున ముందారెండుగ్రంథములలో వివరింపఁబడినవంశముం జూపుదము.

మనుచరిత్రము - ఆముక్తమాల్యద.

చంద్రుడు

|

బుధుడు.

"క. అతనికి యదుతుర్వసు లను, సుతు లుద్భవ మంది రహితసూదునులు కళా
    న్వితమతులు వారిలో వి, శ్రుతకీర్తి వహించెఁ దుర్వసుఁడు గుణనిధియై."

"గీ. వానివంశంబు తుళువాన్వ నాయ మయ్యె,
    నందుఁ బెక్కండ్రు నృపు లుదయంబు నంది
    నిఖిలభువనాభిపూర్ణనిర్ణిద్రకీర్తి
    నధికు లైరి తదీయాన్వయమునఁ బుట్టి."

అను పై రెండుపద్యములవలనను తుర్వసువంశమువారికి మొదలనుండియుఁ దుళువవంశస్థు లని పేరున్నట్లుమాత్రము కానుపించును గాని సాళువవంశ మని చెప్పి యున్నట్లు కానుపించదు. తరువాత నున్న పద్యములో నీవంశములోఁ బ్రసిద్ధుఁడు తిమ్మరా జనియును, నతనికుమారుఁ డీశ్వరరా జనియును జెప్పెను. అదిఎట్లన్నను :-

"మహాస్రగ్ధర, ఘనుఁడై తిమ్మక్షితీశాగ్రణి శఠకమతగ్రావసంఘాతవా తా
శనరా డాశాంతదంతిస్థవిరకిరులజంజాటముల్ మాన్పి యిమ్మే
దిని దోర్డండైకపీఠిం దిరముపఱిచి కీర్తిద్యుతుల్ రోదసిం బ
ర్వ నరాతుల్ నమ్రులై పార్శ్వములఁ గొలువఁ దీవ్రప్రతాపంబు సూపెన్."

ఈతిమ్మరాజుంగూర్చి పారిజాతాపహరణములో వ్రాయకయే,