పుట:Kavijeevithamulu.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నందితిమ్మన.

185

ఆపద్యం బెద్ది యనిన :-

శా. నానానూనవితానవాసనల నానందించుసారంగ మే
   లా నన్నొల్ల దటంచు గంధఫలి బల్కానం దపం బది యో
   షానాసాకృతిఁ దాల్చి సర్వసుమనస్సౌరభ్యసంవాసియై
   పూసెం బ్రేక్షణమాలికామధుకరీపుంజంబు లిర్వంకలన్.

వసుచరిత్రము కృతినొందు సమయమున నున్న రాజు దీని విని వేయివరాలు చేయు నీపద్య మనుడు. రామకృష్ణుఁడు స్వామీ ! అంతమట్టుకు మాత్రమే మీర లిప్పించినఁ గవి కింకను మూఁడువేలు నష్టము అనుడు రాజు కారణం బేమి యని యడిగెను. అపు డాతఁడు క్షౌరకునివృత్తాంతము దెల్పెను. తిమ్మనకు ముక్కుతిమ్మన యని పౌరుషనామము గల్గుటకుఁ గారణ మీముక్కుపైని జెప్పినపద్యమే యని కొందఱియభిప్రాయము. ముక్కెక్కుడు గనుక నని కొందఱిమతము.

తిమ్మకవితమ్ముడును నతనిమేనల్లుఁ డగుమలయమారుతకవియును బ్రబోధచంద్రోదయముం దెనిఁగించిరి. అందులో వానింగూర్చి యీక్రిందివిధమున నున్నది :-

సీ. కలదు కౌశికగోత్రకలశాంబురాశిమం, దారంబు సంగీతనంది నంది
   సింగమంత్రికి బుణ్యశీల పోతమ్మకు, నాత్మసంభవుఁడు మల్లయమనీషి
   అతనిమేనల్లుఁ డంచితభరద్వాజగో, త్రారామచైత్రోదయంబు ఘంట
   నాగధీమణికిఁ బుణ్యచరిత్ర యమ్మాలాం, బకు గూర్మితనయుండు మలయమారు

గీ. తాహ్వయుఁడు సింగనార్యుండు నమృతవాక్కు, లీశ్వరా రాధకులు శాంతులిలఁబ్రసిద్ధు
   లుభయభాషల నేర్పరు లుపమపరస, మర్థు లీకృతిరాజనిర్మాణమునకు.

అనుదీనింబట్టి దీనిలోని మొదటికవీశ్వరునియింటిపేరు నందివా రనియును, అతనితండ్రిపేరు సింగయమంత్రి యనియును, తల్లిపేరు పోచమ యనియును, కవిపేరు మల్లయ్య యనియును దేలినది.

ఇఁక రెండవకవి పైమల్లయకవికి మేనల్లుండు అతనిది భారద్వాజసగోత్రము, ఇంటిపేరు ఘంటవారు తండ్రిపేరు నాగధీమణి తల్లిపేరు అమ్మలాంబ మలయమారుతాహ్వయుఁ డగుసింగన యని కవిపేరు.