పుట:Kavijeevithamulu.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

184

కవి జీవితములు



తిమ్మన దానిని విని యాకవిశిఖామణి శయ్యాలాలిత్యమున కెంతయు సంతసించి తనచెవుల నున్న పచ్చలచౌక ట్లాతనికి బహుమానం బిచ్చి రాజ దర్శనమునకుం దోడ్కొని చనియెను. రాజును నవీనకవీంద్రుం జూచి యే ప్రశ్నంబును నడుగకముందె యాచౌక ట్లెవరిబహుమానం బని యడిగెను. అపు డాకవి వాని మీయాస్థానకవివరుం డగుతిమ్మన యిచ్చె నని తెల్పెను. ఆమాటలువిని "యేమికారణమున నాతఁడు వీని నిచ్చె" నని యడుగుడు నాకవి "యాతనిపైఁ బద్యము సెప్పితి నని విన్నవించెను. అపుడు రాజు దాని కెంతయు నాశ్చర్యమునొంది "యేదీ యాపద్యము విందము చదువుఁ"డనుడు నాకవియుం దానిం జదివెను. దాని విని కడు సంతసించి రాజు కవిం జూచి మీపద్యములోని "గగనధునీ" అనుశబ్దంబునకు మాఱుగా "నాకథునీ" అని యుంచినచోఁ బద్యమునడక మఱియు సొబగుగ నుండునుజుఁ డీ! యనియెను - అట్లే యుంచి యాపద్యము మఱలఁ జదివి దానియమకమున కెంతయు సంతసించి యాకవి ప్రభునిసరసత మెచ్చి తనచెవుల నున్న చౌకట్లం దీసి రాజున కందించి స్వామీ ! దేవరరసజ్ఞత కిది తగు బహుమానముకాదు. అయినఁ జంద్రున కొకనూలుపోగు అన్నట్టు లేను గవిచంద్రుండ వగు నీకీపారితోషికం బిచ్చెదఁ గైకొమ్ము అనుడు సరసుండు గావున రాయండు వాని నందికొని యాకవియౌదార్యసాహసములకు మెచ్చి యొకపళ్ళెరంబున వరాల నుంపించి యామీఁద నీచౌకట్ల నుంచి యాకవికి మరల బహుమానం బిచ్చెను. అనంతర మాకవి శిఖామణి దాని కెంతయు సంతసించి పనివిని యధేచ్ఛం జనియెను.

ఈతిమ్మన యొకానొకదినమున క్షౌరకుం బిలిచి పనిగొని వాని నేర్పున కెంతయు సంతసించి యొకపద్యము వ్రాసి యిచ్చి దీనిం గొని చని మంచికవి కిచ్చితి వేని నీకు రొక్క మెక్కుడుగ దొరకును బొమ్మనుడు మహాప్రసాద మని వాఁడు దానిం గొని కవులకుం జూప నారంభించె. అపుడు రామరాజభూషణకవి దానిచమత్కృతికి నలరి నాల్గువేలవరా లిచ్చి దానిని విలిచి తనవసుచరిత్రమునఁ గాలాంతరమున నుంచెనని వాడుక గలదు.