పుట:Kavijeevithamulu.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

176

కవి జీవితములు



సముతో నిట్లనియె. "అయ్యయ్యో ! నా కీకుఱ్ఱలం జూచిన జాలి యయ్యెడిని. పెద్దన యింకను గొంతకాల ముండిన వీరికిం జదువుసంధ్యల నేర్పి తనయంతవారిం జేయును గదా ! ఇపుడు వీరికి విద్య యలవడు టెట్లు తండ్రివిద్వాంసుఁ డైనఁగొడుకులును నట్టివారగుట యెచ్చటనో గద అనుభట్టుమూర్తి పల్కులాలించి పెద్దనకుటుంబిని తనపుత్త్రుల నతఁడధిక్షేపించుటగ నెంచి కనలి యిట్లనియె. నాపుత్త్రులు తండ్రిఁబోలెవిశేషముగఁ బ్రజ్ఞావంతులు గాకున్న శ్లేషకవనము చెప్పికొని యైనను బొట్టపోసికొనెడువా రగుదురు పొమ్ము, వీరింగూర్చి నీవు వగవకుము. అనుడు భట్టుమూర్తి యాపెపల్కుల నాలించి తా శ్లేషకవి యవుటయుఁ దాఁ పెద్దనకు మిగుల నిష్టుండు గాకుండుటయుఁ దలఁచి యామె యట్ల నె నని యూహించి యనంతరము నిజనివాసమునకుఁ జనియెను.


ఆంధ్రపంచకావ్యకవులచారిత్రము.

11.

[1]నంది తిమ్మన

ఈ తిమ్మనచారిత్రము దెల్పుటకు మనకు రెండుగ్రంథములు గలవు. అం దొకటి పారిజాతాపహరణము. రెండవది యాంధ్రప్రబోధ చంద్రోదయము - అందు మొదటిదానిలో :-

"సీ. కౌశికగోత్రవిఖ్యాతుఁ డాపస్తంబ, సూత్రుఁ డాఱ్వేలపవిత్రకులుఁడు
    నందిసింగామాత్యునకును దిమ్మాంబకుఁ, దనయుండు సకలవిద్యావివేక
    చతురుఁడు మలయమారుతకవీంద్రునకు మే, నల్లుండు కృష్ణరాయక్షితీశ
    కరుణాసమాలబ్ధఘనచతురంతయా, నమహాగ్రహారసన్మానయుతుఁడు

గీ. తిమ్మనార్యుండుశివపరాధీనమతి య, ఘోరశివగురుశిష్యుండు పారిజాత
   హరణ మనుకావ్య మొనరించె నాంధ్రభాష, నాదివాకరతారాసుధాకరముగ,

  1. ముక్కుతిమ్మన