పుట:Kavijeevithamulu.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

170

కవి జీవితములు



డయ్యెను. కావున శుశ్రూషార్హుండు గాఁడు" అని వానిం జూచి "యోయీ ! యిఁక నాపాదములు ముట్టకుము; ఇంటికడనే యుండి పాఠములు చింతన సేయుచుండుము, రాజదర్శనార్థము నినుఁ దోడ్కొని పోయెదను" అని దానికిఁ దగు నుపాయ మన్వేషింపుచుఁ గొంత చింతించి పర్యాయంబున నాలోచింత మని నిశ్చయించి భట్టుం జూచి నేను లేకుండ రాజుకడకుఁ జనవల దని తెల్పి తా నిదురించెను. అంత భట్టు తనప్రజ్ఞావిశేషములు పెద్దనకే యధికముగఁ దోఁచుట తెలిసికొని మిక్కిలి సంతసించి రాజదర్శనమునకుఁ జనఁ దనలోఁ దా నిట్లు చింతించె. "పెద్దన నన్నుఁ దా లేనపుడు రాజుకడ కఱుగవల దనెను. దీనికిఁ గారణం బేమి. నాకు విశేషసన్మానము గల్గు ననియెంచి కానోవును, ఇట్టి వాని నమ్మినఁ గార్యం బేమి? కావున నే నిపుడు రాజుకడ కేఁగి మద్వృత్తాంతం బాతని కెఱింగించి వచ్చెద. ఉదయమైన నీతం డేదేనియంకిలి గావింపనోపును. అని యెంచి తత్క్షణంబ బయలు వెడలి నగరు చేరం జని తనవార్త రాజునకుఁ బంపిన నాతఁడు కవి వచ్చె నని విని సంతసించి యపుడు సమయం బొసంగిన నీభట్టు కట్టెదుటనిలిచి కైవారంబు సేసి "కుంజరయూథంబు దోమకుత్తుక సొచ్చెన్" అనునట్లు తా నంతవఱకుఁ బ్రసిద్ధి లేక పెద్దనగృహంబున నుంటి ననియు నాకెన్నఁడును నాతఁడు దేవరదర్శనలాభము గల్గున ట్లొనరించి యుండలే దనియు నింతియకాక తనకుఁ దెలియకుండ దర్శనంబునకుఁ బోవల దనియుఁ దెల్పిన నాతఁడు నిద్రించుతఱిఁ గనుమొఱఁగి వచ్చితినని యాతనివలనిభయం బభినయించుచునుండెను. అది విని రాజు కొంచె మాలోచించి పెద్దన యిట్లొనర్చునా యనుకొని యయినను సంగతి నరయవలయుఁ బెద్దన నిటకుఁ దోడ్కొని రమ్మని భృత్యులకుం దెల్పెను. వారును వేగంబున వచ్చి నిద్రబోవుచున్న పెద్దన్నను లేపి రాజాజ్ఞఁ దెలిపిన నాతఁ డట్టిసమయమునఁ బ్రభుఁడు రాఁబంచుటకుఁ గారణం బేమని యూహించి తనశిష్యుం బిలిచెను. వాఁ డట లేకుంటచే రాజు