పుట:Kavijeevithamulu.pdf/18

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
6
కవి జీవితములుబఱిచెదము. ఈమైలమభీమనశాసనము అమరావతిలోని అమరేశ్వరుని దేవళముపై నున్నట్లును అది శాలివాహన. సం. 925 యైనట్లును "Elliot Marbles" అనుపుస్తకమువలనం గాన్పించును.

ఇతనిసంతతివారే ఆంధ్రదేశములోని పూసపాటి మహారాజులందఱును అని తెలియుచున్నది. ఇతనితల్లి యగుమైలమాంబవలన నితనికి మైలమభీమన యనునామము గల్గినది. ఆవృత్తాంతమును మఱికొంత యితర వృత్తాంతమును నీభీమకవిచారిత్రాంతమున జూపెదము.

చ. గరళపుముద్ద లోహ మవగాఢమహాశనికోట్లు సమ్మెటల్
    హరునయనాగ్ని కొల్మి యురగాధిపుకోఱలు పట్టుకార్లు ది
    క్క రులయురంబు దాయి లయకాలుఁడు కమ్మరి వైరివీరసం
    హరణగుణాభిరాముఁ డగుమైలమభీమనఖడ్గసృష్టికిన్.

ఈకవి యొకానొకసమయమున గుడిమెట్ట యనుగ్రామమునకుఁ జనియె. అపుడు తనగుఱ్ఱము నొకచోఁ గట్టించి నది కనుమొఱంగి చనియె. దానిని వెదకుటకుఁ దనసాహిణిం బంచిన వాఁడును వెదకివెదకి యతి శ్రీపతిరాజు పోతరా జనునొక రాచకొమారునిచేఁ బట్టువడినట్లును, దన కది సాధ్యము కానట్లును విన్న వించెను. అపుడు భీమనయు గుఱ్ఱంబు తన దై నట్లును, దాను వైదేశికుం డై నట్లును, ముందు జాగ్రత్తగా దాని నుంచుటకు సాహిణికిం జెప్పెద ననియు వర్తమానంబు పంచెను. అది విని యాక్షత్రియుఁడు సరకు సేయఁడయ్యెను. అతనితమ్ముఁ డది కర్జంబు కా దనిన వినడయ్యెను. ఇట్లారాజు తాఁ బట్టినపట్టు విడువకుండుటకుఁ దనలో గోపించి భీమన యీక్రిందిపద్యమును వ్రాసి పంపెను. అదెట్లన్ననుః-

చ. హయ మది సీత - పోతవసుధాధిపుఁ డారయ రావణుండు ని
   శ్చయముగ నేను రాఘవుఁడ[1] జాహ్నవి వారిధి మారుఁ డంజనా
   ప్రియతనయుండు[2]సింగన విభీషణుఁ డాగుడిమెట్ట లంక నా
   జయమును బోతరక్కసునిచావును నేడవనాఁడు చూడుఁడీ.

  1. సహ్యజ
  2. లచ్చన, అని యప్పకవీయములో దీనికిఁ బాఠాంతర, మున్నది.